Ajinkya Rahane: ఆ ఆటగాడికి గంభీర్ అండ కావాలి : అజింక్య రహానే
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు బ్యాటర్ సంజు శాంసన్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమై ఇప్పటివరకు కేవలం 16 పరుగులే (10, 6, 0) సాధించాడు. గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్‌లో డకౌట్ కావడం మరింత నిరాశ కలిగించింది. ఈ పరిస్థితుల్లో భారత జట్టు సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే సంజూ ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. శుభ్‌మన్ గిల్ పేలవ ఫామ్ కారణంగా తుదిజట్టుకు దూరమవ్వడంతో సంజూకు అవకాశం దక్కుతోంది. కానీ ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడంలో అతడు తడబడుతున్నాడు.
Details
సంజూపై ఒత్తిడి పెరిగింది
సంజూ పుంజుకోవాలంటే టీమ్ మేనేజ్‌మెంట్, ముఖ్యంగా కెప్టెన్ పాత్ర చాలా కీలకమని రహానే అభిప్రాయపడ్డాడు. అభిషేక్ శర్మలా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించడం వల్ల సంజూ అనవసర ఒత్తిడికి లోనవుతున్నాడని ఆయన పేర్కొన్నాడు. సంజూకు కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టమైన భరోసా ఇవ్వాలని రహానే సూచించాడు. వరల్డ్‌కప్ జట్టులో అతడు ఉంటాడని ముందే చెప్పడం ద్వారా సంజూలోని ఆందోళన తగ్గుతుందని, అప్పుడు అతడు స్వేచ్ఛగా తన సహజ ఆటను ఆడగలడని అన్నాడు. మరోవైపు అభిషేక్ శర్మ వేగంగా పరుగులు చేస్తుంటే, తానూ అలాగే ఆడాలన్న ఆలోచన సంజూకు ఒత్తిడిని పెంచుతోందని రహానే విశ్లేషించాడు.
Details
ఇషాన్ నుంచి గట్టి పోటీ
తన మీద నమ్మకం కోల్పోకుండా, తన సొంత స్టైల్‌లో బ్యాటింగ్ చేయాలని సంజూకు హితవు పలికాడు. ఇదే సమయంలో సంజూకు ఇషాన్ కిషన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దేశవాళీల్లో నిలకడగా రాణించి జాతీయ జట్టులోకి వచ్చిన ఇషాన్, రెండో టీ20లో అద్భుత ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తిలక్ వర్మ గైర్హాజరీలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న ఇషాన్ కిషన్ ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో మూడు టీ20ల్లో వరుసగా 8, 76, 28 పరుగులు చేశాడు. ఈ పోటీ నేపథ్యంలో సంజూ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.