New York: న్యూయార్క్‌లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన మహిళ.. పోలీసు కాల్పుల్లో మృతి
ఈ వార్తాకథనం ఏంటి
న్యూయార్క్‌లోని ప్రముఖ టైమ్స్ స్క్వేర్‌లో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రెండు పెద్ద కిచెన్ కత్తులతో ఇద్దరిపై దాడికి పాల్పడింది. ముందుగా 68 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రోడ్డు దాటేందుకు ఎదురుచూస్తున్న సమయంలో అతని పొట్టలో కత్తితో పొడిచింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే 32 ఏళ్ల మరో మహిళపై కూడా కత్తితో దాడి చేసింది. ఆమె పొట్టలో కత్తితో గాయపరిచింది.
వివరాలు
ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి స్థిరం
దాడిలో గాయపడిన ఇద్దరినీ పోలీసులు వెంటనే బెల్‌వ్యూ ఆసుపత్రికి తరలించారు.
అయితే 32 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. 68 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మాందాని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఒక బాధితురాలు మృతిచెందిన విషయం తనను తీవ్రంగా బాధించిందని, మరో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.
ఘటన మరింత తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకున్న న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (NYPD) అధికారులకు మాందాని కృతజ్ఞతలు తెలిపారు.
వివరాలు
కత్తులు వదలని మహిళ.. పోలీసుల కాల్పులు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఘటనకు సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
మహిళ చుట్టూ పది మందికి పైగా పోలీసులు చేరినట్లు వీడియోల్లో ఉంది.
ఆ సమయంలో ఆమె చేతుల్లో రెండు పెద్ద కిచెన్ కత్తులు ఉన్నాయి. వాటిని కింద పడేయాలని పోలీసులు కొన్ని నిమిషాల పాటు ఆమెను హెచ్చరించారు.
అయితే పోలీసుల ఆదేశాలను మహిళ పట్టించుకోలేదు. కత్తులను వదిలేందుకు నిరాకరించింది.
అంతేకాకుండా పోలీసులతో మాట్లాడుతూ.. తాను ఏమీ వదలనని, ఇద్దరినీ చంపాలని కోరుకుంటున్నానని చెప్పినట్లు వీడియోల్లో వినిపించింది.
ఆ తర్వాత మహిళ చేతుల్లో కత్తులు పట్టుకుని పోలీసుల వైపు వేగంగా కదిలినట్లు మరో వీడియోలో కనిపించింది.
దీంతో పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు.
వివరాలు
ఉగ్రవాదంతో సంబంధం లేదని భావిస్తున్న పోలీసులు
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహిళ నేలపై కుప్పకూలింది. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, గాయాల తీవ్రతతో మృతిచెందింది.
ఈ ఘటనపై NYPD అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ఈ దాడికి ఉగ్రవాదంతో సంబంధం లేదని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
దాడికి అసలు కారణమేంటి? మహిళ ఈ చర్యకు ఎందుకు పాల్పడింది? అనే విషయాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.
వివరాలు
స్థానిక ప్రజల్లో భయాందోళన
ముఖ్యంగా మహిళ మానసిక ఆరోగ్య పరిస్థితిపైనా అధికారులు దృష్టి సారించారు.
ఆమె మానసిక స్థితి ఈ దాడికి ఏమైనా కారణమైందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించేందుకు పోలీసులు ప్రెస్ బ్రీఫింగ్ నిర్వహించనున్నారు.
మరోవైపు టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన ఈ ఘటన స్థానిక ప్రజల్లో భయాందోళనకు కారణమైంది.
దాడికి సంబంధించిన పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.