Pakistan Blast: పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, 25మంది మృతి
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడి జరిగి 25మంది మృతి చెందగా, మరో 120 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని వాయువ్య నగరం పెషావర్‌లో మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులతో పాటు సాధారణ పౌరులు మొత్తం 150 మంది వరకు మసీదులో ప్రార్థన చేస్తుండగా, బాంబర్ ఆత్మాహుతికి పాల్పడినట్లు స్థానిక పోలీసు అధికారి జాఫర్ ఖాన్ తెలిపారు. రెండు వరుస పేళ్ళుల్లు సంభవించినట్లు పేర్కొన్నారు. పేలుడు ప్రభావంతో మసీదు పైకప్పు కూలిపోయినట్లు ఆయన చెప్పారు.
దాడిని ఖండించిన పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్
ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు పెషావర్ నగర డిప్యూటీ కమిషనర్ షఫివుల్లా ఖాన్ చెప్పారు. శిథిలాల కింది చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఖాన్ పేర్కొన్నారు. ఆత్మాహుతి దాడిని ప్రధాని షాబాజ్ షరీఫ్ ఖండించారు. బాధితులకు సాధ్యమైనంత వరకు ఉత్తమమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.