భారత్‌తో మూడు యుద్ధాలు తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని ఆయన చెప్పారు. కశ్మీర్ విషయంపై ఇప్పుడు పొరుగుదేశంతో శాంతి చర్చలను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్‌కు చెందిన అల్ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ తమ దేశ పౌరులకు తిండిగింజలను కూడా అందించడానికి నానా అవస్థలు పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. ఆఖరికి గోధుమ పిండికోసం కోట్లాడుకున్న ఘటనలు ఆ దేశంలో వెలుగుచూశాయి. ఈ క్రమంలో ఆ దేశం సాయం కోసం ఇతర దేశాలను అర్థిస్తోంది .
పాకిస్థాన్‌కు నిరుద్యోగం, పేదరికమే మిగిలాయి: షెహబాజ్ షరీఫ్
కశ్మీర్ వంటి మన బర్నింగ్ పాయింట్‌పై చిత్తశుద్ధితో చర్చలు జరుపుదామని ప్రధాని మోదీకి షరీఫ్ సూచించారు. శాంతియుతంగా జీవించడం లేదా కలహాలను పెంచుకోవడం అనేది ఇరు దేశాల చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌తో చేసిన మూడు యుద్ధాల కారణంగా తాము అన్ని రకాలుగా నష్టపోయామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఆ యుద్ధాలు ప్రజలకు మరింత కష్టాలు తెచ్చిపెట్టాయని, పేదరికం, నిరుద్యోగాన్ని పెంచాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ శాంతిని కోరుకోవడం వల్ల తమ దేశంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఇరు దేశాల వద్ద ఉన్న వనరులను పరస్పరం వినియోగించుకొని, కలిసి అభివృద్ధి పథంలో నడుద్దామని ఆయన సూచించారు.