పాకిస్థాన్‌కు తాలిబాన్ల భయం.. అఫ్గాన్ శరణార్థుల బహిష్కరణ
పాకిస్థాన్‌కు తాలిబాన్ల భయం వెంటాడుతోంది. దేశానికి తాలిబాన్ ముప్పు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అఫ్గాన్ నుంచి వచ్చిన శరణార్థులపై పాక్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బతుకుదెరువుకోసం అఫ్గనిస్థాన్ నుంచి వచ్చిన వలసదారులను బహిష్కరిస్తోంది. గత మూడు రోజుల్లో 600 మందికి పైగా అఫ్గాన్ పౌరులను దేశం నుంచి వెళ్లగొట్టింది. సింధ్ ప్రావిన్స్ నుంచి శనివారం 302 మంది, సోమవారం 303 మందిని ఆఫ్ఘనిస్తాన్‌కు తిప్పి పంపింది. వీరిలో 63 మంది మహిళలు, 71 మంది చిన్నారులు ఉన్నారు. రానున్న రోజుల్లో మరో 800 మందిని బహిష్కరించే అవకాశం ఉన్నట్లు పాకిస్థాన్ వర్గాలు చెబుతున్నాయి.
పాక్‌లో 2.5 లక్షల మంది అఫ్గాన్ పౌరులు
2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 2.5 లక్షల మంది అఫ్గాన్ పౌరులు పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అప్పటి నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన అఫ్గాన్ పౌరులపై పాక్ నిర్భందాలను పెంచింది. దాదాపు 1,400 మందిని కరాచీ, హైదరాబాద్‌లో పాకిస్థాన్ నిర్భందించింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన అనేక మంది అఫ్గాన్ పౌరులను ఇప్పటికే పాకిస్థాన్ అరెస్టు చేసి జైళ్లలో పెట్టింది. అయితే అఫ్గనిస్థాన్ పౌరులను పాక్ బహిష్కరించడాన్ని ఆ దేశంలోని హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. బహిష్కరణలను ఆపేలా అధికారులను ఆదేశించాలని దేశ మానవ హక్కుల జాతీయ కమిషన్ డిమాండ్ చేస్తున్నారు. అక్రమ వలసదారులపై మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సింధ్ ముఖ్యమంత్రి సలహాదారు ముర్తాజా వహాబ్ చెప్పారు.