AP Power Demand: ఏపీలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి.. బహిరంగ మార్కెట్ కొనుగోళ్లు భారీగా తగ్గింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో విద్యుత్ వినియోగం ఈసారి రికార్డు స్థాయికి చేరుతోంది. వేసవికాలంలో గరిష్ఠ డిమాండ్ 280 మిలియన్ యూనిట్లు (ఎంయూలు) వరకు వెళ్లొచ్చని అధికారులు ముందుగానే అంచనా వేశారు. మార్చి రెండో వారంలోనే ఒక రోజు విద్యుత్ వినియోగం 274.85 ఎంయూలుగా నమోదవడం, రోజువారీ సగటు వినియోగం 270 ఎంయూల వద్ద కొనసాగడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తుగా విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీ జెన్‌కో థర్మల్ కేంద్రాల నుంచి రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండటంతో, బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు పెద్ద మొత్తంలో విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.
వివరాలు
ఫలించిన ముందస్తు ప్రణాళిక
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉండే పీక్ డిమాండ్ సమయంలో కూడా కొన్ని 15 నిమిషాల టైం బ్లాక్‌లలో మాత్రమే పరిమిత స్థాయిలో విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ ఏడాదికీ ట్రూఅప్ భారం ప్రజలపై పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రానికి అందుబాటులో ఉన్న వనరుల నుంచే సుమారు 265 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆ ప్రణాళిక ఇప్పుడు ఫలితాన్నిస్తోంది. గరిష్ఠ వినియోగం 274 ఎంయూలుగా నమోదైన రోజున కూడా కేవలం 5.2 ఎంయూల విద్యుత్ మాత్రమే అదనంగా కొనాల్సి వచ్చింది.
వివరాలు
జెన్‌కోలో రికార్డు ఉత్పత్తి
ఇక ఏప్రిల్ నుంచి పంటల సీజన్ ముగియనుండటంతో వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం మరో 35 ఎంయూల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి గరిష్ఠ స్థాయిలో ఉత్పత్తి సాధించేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశారు. ఇందుకోసం అవసరమైన బొగ్గు నిల్వలను ముందుగానే సమకూర్చడంతో పాటు, వాటి నాణ్యతపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం విజయవాడలోని వీటీపీఎస్‌లో 3.3 లక్షల టన్నులు, కడప ఆర్‌టీపీపీలో 3.8 లక్షల టన్నులు, కృష్ణపట్నంలో 3 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. నిల్వలు సమృద్ధిగా ఉండటంతో జెన్‌కో కేంద్రాలు రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.
వివరాలు
ఒక్కరోజే 54.11 ఎంయూల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కొత్త రికార్డు
విజయవాడలోని వీటీపీఎస్ గురువారం ఒక్కరోజే 54.11 ఎంయూల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. గతేడాది మార్చి 8న నమోదైన 53.81 ఎంయూల రికార్డును ఇది అధిగమించింది. అలాగే కృష్ణపట్నంలోని మూడు యూనిట్ల ద్వారా రోజుకు అత్యధికంగా 51.554 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి అయింది. అందులో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడో యూనిట్ 98.3 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను నమోదు చేసింది. ఏపీ జెన్‌కో కూడా ఒకే రోజు 139.58 ఎంయూల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించి మరో రికార్డు సృష్టించింది. ఇందులో థర్మల్ విద్యుత్ 127.875 ఎంయూలు, జల విద్యుత్ 9.714 ఎంయూలు, సౌర విద్యుత్ 1.991 ఎంయూలుగా ఉన్నాయి.
వివరాలు
భారీగా తగ్గనున్న కొనుగోళ్లు
వైకాపా ప్రభుత్వ హయాంలో వేసవికాలంలో రోజుకు సుమారు 40 ఎంయూల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. దీని వల్ల ప్రతి ఏడాది ట్రూఅప్ భారం ప్రజలపై పడేదని విమర్శలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాదే విద్యుత్ కొనుగోళ్లు తగ్గించినట్లు అధికారులు చెబుతున్నారు. దానికి అనుగుణంగా ట్రూడౌన్ కూడా చేసినట్లు పేర్కొంటున్నారు. ఈ ఏడాది అయితే బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోళ్లు మరింత గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.