LOADING...
Dubai Airport: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. తాత్కాలికంగా విమాన సర్వీసులు నిలిపివేత
తాత్కాలికంగా విమాన సర్వీసులు నిలిపివేత

Dubai Airport: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. తాత్కాలికంగా విమాన సర్వీసులు నిలిపివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున డ్రోన్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్‌లలో ఒకటి ప్రభావితమవడంతో భారీ మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే సివిల్ డిఫెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని అగ్నిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనను దుబాయ్ మీడియా ఆఫీస్ అధికారికంగా ధ్రువీకరించింది. డ్రోన్ కారణంగా ఫ్యూయల్ ట్యాంక్‌లలో ఒకదానికి నష్టం వాటిల్లిందని, వెంటనే స్పందించిన సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను ఆర్పేశాయని తెలిపింది. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని, ఎవరికీ హాని జరగలేదని స్పష్టం చేసింది.

వివరాలు 

విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత 

ఘటన తర్వాత ముందుజాగ్రత్త చర్యగా దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలు ఆగిపోవడంతో ప్రయాణికులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

ఎలాంటి అధికారిక ప్రకటన చేయని యూఏఈ అధికారులు

ఇక ఈ డ్రోన్ ఘటనకు బాధ్యులు ఎవరు అన్న విషయంలో యూఏఈ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ ఘటన వెనుక ఇరాన్ పాత్ర ఉండొచ్చని కొన్ని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. తమ విమానాల వివరాల కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ దగ్గర డ్రోన్ దాడి 

Advertisement