Loading...
India's Wedding Economy: 25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు.. రూ.7 లక్షల కోట్ల వ్యాపారం!
25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు.. రూ.7 లక్షల కోట్ల వ్యాపారం!

India's Wedding Economy: 25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు.. రూ.7 లక్షల కోట్ల వ్యాపారం!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం త్వరలోనే పెళ్లి సందడితో మారుమోగనుంది. పల్లెల్లోని చిన్న వీధుల నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా పెళ్లి వేడుకల సందడే కనిపించనుంది. ఈసారి లక్షల్లో కాదు.. ఏకంగా 52 లక్షల వివాహాలు జరగనున్నాయి. అదికూడా కేవలం 25 రోజుల్లోనే. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకు దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో పెళ్లిళ్లు జరగనున్నాయని అంచనా వేస్తున్నారు. అంటే రోజుకు సగటున రెండు లక్షల వివాహాలు జరగనున్నాయి. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని పెళ్లిళ్లు జరగడం దేశంలోనే ఆల్‌టైమ్ రికార్డుగా నిలవనుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు 

అతిపెద్ద పెళ్లిళ్ల సీజన్‌గా..

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనాల ప్రకారం.. ఈ పెళ్లిళ్ల సీజన్‌తో దేశవ్యాప్తంగా సుమారు రూ.7 లక్షల కోట్ల వ్యాపారం జరగనుంది.

25 రోజుల్లో 52 లక్షల వివాహాలు జరగడం భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద పెళ్లిళ్ల సీజన్‌గా నిలవనుందని సంస్థ పేర్కొంది.

దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లోని 300 మంది వాణిజ్య ప్రతినిధులు, 550 ట్రేడ్ అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపిన అనంతరం CAIT పరిశోధన విభాగం ఈ నివేదికను విడుదల చేసింది.

వివరాలు 

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోనే 5 లక్షల పెళ్లిళ్లు

ఈ పెళ్లిళ్ల సీజన్‌లో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన ఎన్‌సీఆర్‌లోనే సుమారు ఐదు లక్షల వివాహాలు జరగనున్నట్లు నివేదిక వెల్లడించింది.

వీటి ద్వారా ఒక్క ఈ ప్రాంతంలోనే రూ.2.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా చాందినీ చౌక్, సదర్ బజార్, కరోల్ బాగ్, లాజ్‌పత్ నగర్ వంటి ప్రధాన హోల్‌సేల్ మార్కెట్లలో కొనుగోళ్లు భారీగా పెరగనున్నాయి.

పెళ్లిళ్లకు అవసరమైన వస్తువుల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు ఈ మార్కెట్లకు వచ్చే అవకాశం ఉందని CAIT తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

ఏ రంగంలో ఎంత వ్యాపారం?

పెళ్లిళ్లకు సంబంధించిన మొత్తం వ్యాపారంలో వస్తువుల కొనుగోళ్ల వాటా 54 శాతంగా ఉండనుంది.

వీటి విలువ సుమారు రూ.4.05 లక్షల కోట్లు. ఇక సేవల రంగం ద్వారా మరో 46 శాతం అంటే రూ.3.45 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

వివిధ రంగాల్లో జరగనున్న వ్యాపారానికి సంబంధించి CAIT ఇచ్చిన అంచనాలు ఇలా ఉన్నాయి. -

బంగారు ఆభరణాల కొనుగోళ్లు: రూ.1.2 లక్షల కోట్లు

దుస్తుల కొనుగోళ్లు: రూ.90 వేల కోట్లు

బహుమతులు, ఇతర అలంకరణ వస్తువులు: రూ.37,500 కోట్లు

మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్: రూ.30 వేల కోట్లు

ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు: రూ.30 వేల కోట్లు

ADVERTISEMENT

వివరాలు 

1.25 కోట్ల మందికి తాత్కాలిక ఉపాధి

వస్తువుల కొనుగోళ్లతో పాటు సేవల రంగంలోనూ భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.

క్యాటరింగ్ రంగానికి సుమారు రూ.75 వేల కోట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లకు రూ.60 వేల కోట్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగానికి రూ.37,500 కోట్ల వ్యాపారం లభించవచ్చని అంచనా వేసింది.

ఈ పెళ్లిళ్ల సీజన్ వ్యాపార రంగానికే కాకుండా ఉపాధి అవకాశాల కల్పనకు కూడా దోహదపడనుంది.

వివాహ వేడుకల నిర్వహణకు అవసరమైన వివిధ సేవల కారణంగా సుమారు 1.25 కోట్ల మందికి తాత్కాలిక, సీజనల్ ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని CAIT నివేదిక పేర్కొంది.

క్యాటరింగ్, డెకరేషన్, ఫొటోగ్రఫీ, బ్యూటీ సర్వీసెస్, రవాణా, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.

వివరాలు 

పెళ్లిళ్ల ఖర్చులు కూడా భారీగానే..

మరోవైపు పెళ్లిళ్ల నిర్వహణకు అయ్యే ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని CAIT గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మధ్యతరగతి కుటుంబాల్లో వివాహాల కోసం సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.

ఇక ప్రీమియం స్థాయి వివాహాలకు రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా దేశంలో పెళ్లిళ్ల వ్యాపారం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

2022లో ఈ రంగం ద్వారా రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరగ్గా.. 2024 నాటికి అది రూ.5.90 లక్షల కోట్లకు చేరింది.

వివరాలు 

పెళ్లిళ్ల ఖర్చులు కూడా భారీగానే..

2025లో సుమారు 46 లక్షల వివాహాల ద్వారా రూ.6.50 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈసారి 52 లక్షల పెళ్లిళ్లతో వ్యాపారం మరో స్థాయికి చేరనుంది.

ఈ నేపథ్యంలో దేశీయంగా తయారైన వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ సూచించారు.

అలా చేయడం వల్ల స్థానిక తయారీదారులు, కళాకారులు, చిన్న వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ఈ పెళ్లిళ్ల సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతాన్నిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT