LOADING...
Vishakapatnam: విశాఖ మెట్రోపై ఏపీ ప్రభుత్వ కీలక అప్డేట్.. త్వరలో కేంద్రం నుంచి అనుమతులు
త్వరలో కేంద్రం నుంచి అనుమతులు

Vishakapatnam: విశాఖ మెట్రోపై ఏపీ ప్రభుత్వ కీలక అప్డేట్.. త్వరలో కేంద్రం నుంచి అనుమతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం మెట్రో ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మెట్రో ప్రాజెక్ట్‌పై రైడర్స్ సంస్థ అధ్యయనం నిర్వహిస్తోందని, మరో రెండు నెలల్లో ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని చెప్పారు. అదే సమయంలో, హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్ తరహాలో విశాఖపట్నంలో సెమీ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ రింగ్ రోడ్డు పూర్తి అయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని అన్నారు. సెమీ రింగ్ రోడ్డు నిర్మాణంపై వీఎంఆర్‌డీయే అధ్యయనం చేస్తోందని, విశాఖ అభివృద్ధిలో హడ్కో సహకారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

వివరాలు 

త్వరలో కేంద్రం నుంచి అనుమతులు

విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందని మంత్రి నారాయణ వెల్లడించారు. మరో రెండు, మూడు రోజుల్లో కేంద్రం నుంచి ఆమోదం లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అనుమతులు వచ్చిన వెంటనే మెట్రో నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించనున్నట్లు చెప్పారు. మూడేళ్లలో మెట్రో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. విశాఖలో జరిగిన పట్టణ గృహ నిర్మాణశాఖ రీజినల్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న మంత్రి నారాయణ, కార్పొరేషన్లు,మున్సిపాలిటీలకు ఆదాయ వనరులు పెంచే మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. రాంబిల్లి-భోగాపురం ప్రాజెక్టును వీఎంఆర్‌డీయే పరిశీలిస్తోందని చెప్పారు.

వివరాలు 

విశాఖ మెట్రో రూట్ ఇదే..

మాస్టర్‌ప్లాన్ రోడ్లలో ఒకదానికి అటవీ భూమి అడ్డంకిగా మారిందని, ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో చర్చించి పరిష్కారం చూపిస్తామని అన్నారు. విశాఖపట్నంలో తొలి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ దశలో మొత్తం 46.23 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని అభివృద్ధి చేయనుండగా, ఇందులో మూడు కారిడార్లు ఉండనున్నాయి. స్టీల్ ప్లాంట్-కొమ్మాది, ఓల్డ్ పోస్టాఫీస్-గురుద్వారా, చినవాల్తేరు-తాటిచెట్లపాలెం మార్గాల్లో మెట్రో రైలు నడవనుంది. ఇందులో 20.16 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు.

Advertisement

వివరాలు 

త్వరలో డీపీఆర్‌కు అనుమతి.. తర్వాత టెండర్లు

ఇప్పటికే మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం ప్రాథమిక అనుమతి ఇచ్చినట్లు సమాచారం. డీపీఆర్‌ను సిద్ధం చేయగా, దానికి కూడా కేంద్రం నుంచి ఆమోదం రావాల్సి ఉంది. త్వరలో డీపీఆర్‌కు అనుమతి లభించిన తర్వాత టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. ఈ మెట్రో ప్రాజెక్ట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేయనున్నాయి. ఇందులో భాగంగా కేంద్రం కూడా తన వాటా నిధులను కేటాయించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. త్వరలో అక్కడ సర్వే చేపట్టి, అనంతరం డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు.

Advertisement