UAE: యూఏఈలో ఫేక్ వీడియోల కేసు.. 19 మంది భారతీయుల అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం, కల్పిత వీడియోలు, భయాందోళనలు కలిగించే పోస్టులు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు ప్రారంభించింది. నిబంధనలు అతిక్రమించిన కేసుల్లో మొత్తం 35 మందిని అరెస్ట్ చేయగా, వారిలో 19 మంది భారతీయులు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
ఏం జరిగింది?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో క్షిపణి దాడులు, రక్షణ వ్యవస్థల కార్యకలాపాలు వంటి సున్నితమైన దృశ్యాలను వీడియోలు తీయకూడదని యూఏఈ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ తాజాగా 25 మందిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. వీరిలో 17 మంది భారతీయులు ఉన్నారు. దీనికి ముందు శనివారం మరో 10 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఇలా ఇప్పటివరకు అరెస్ట్ అయిన భారతీయుల సంఖ్య 19కి చేరింది.
వివరాలు
మూడు విధాలుగా తప్పుడు ప్రచారం
అరెస్ట్ అయిన నిందితులు మూడు వేర్వేరు గ్రూపులుగా పనిచేస్తూ సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే ప్రచారం చేసినట్లు అధికారులు వెల్లడించారు. క్షిపణుల వీడియోల ప్రచారం ఆకాశంలో ప్రయాణిస్తున్న క్షిపణులు లేదా వాటిని అడ్డుకుంటున్న రక్షణ వ్యవస్థల దృశ్యాలను చిత్రీకరించి, వాటికి భయపెట్టే శబ్దాలు జోడించి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు గుర్తించారు. ఏఐతో నకిలీ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పేలుళ్లు జరిగినట్లు కనిపించే కృత్రిమ వీడియోలను తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇతర దేశాల్లో గతంలో జరిగిన ఘటనలను యూఏఈలో జరిగినట్లుగా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
శత్రు దేశాలకు అనుకూల పోస్టులు
యూఏఈ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలు, వాటి సైనిక చర్యలకు మద్దతుగా లేదా ప్రశంసలతో పోస్టులు పెట్టిన వారినీ అధికారులు గుర్తించారు. కఠిన శిక్షలు ఇలాంటి చర్యలు దేశ భద్రతకు ముప్పుగా మారతాయని అటార్నీ జనరల్ హెచ్చరించారు. నిందితులకు కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష విధించే అవకాశం ఉందని, అదనంగా ఒక లక్ష దిర్హమ్‌లకు తగ్గకుండా జరిమానా పడవచ్చని సమాచారం. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.22 లక్షలకు పైగానే ఉంటుంది. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారందరినీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అదుపులోకి తీసుకుని, కేసులపై వేగంగా విచారణ జరపాలని ఆదేశించినట్లు తెలిసింది.