'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్
ఏ చిన్న అవకాశం వచ్చినా.. పాక్, చైనాపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. తాజాగా సైప్రస్‌లోని ప్రవాస భారతీయలను ఊద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్, చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. పొగురు దేశాలతో భారత్ మంచి సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు ఎస్.జైశంకర్. అలాగని ఉగ్రవాదాన్ని అంగీకరించే ఉద్దేశం తమకు లేదని పరోక్షంగా పాకిస్థాన్‌పై సెటైర్ వేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం కారణంగా భారత్ బాధపడినంతగా.. ఏ దేశం బాధపడలేదన్నారు. అయితే తాము ఎప్పటికీ ఉగ్రవాదాన్ని బలవంతంగా చర్చకు తీసుకురాబోమన్నారు.
'ఎల్ఏసీని ఏకపక్షంగా మారిస్తే ఉపేక్షించబోం'
చైనాపై కూడా తనదైన శైలిలలో స్పందించారు జైశంకర్. కరోనా కాలం నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణంగా లేవన్నారు. వాస్తవ నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చే ప్రయత్నాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమన్నారు. ప్రస్తుతం భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, ప్రపంచంలోని సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపిస్తోందన్నారు జైశంకర్. డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్‌లోని ఎల్ఏసీ వద్ద భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. అనంతరం ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగిగా అవి ఎలాంటి పరిష్కారాన్ని కనుగొనలేదు. 2020 తర్వాత ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన మొదటి సరిహద్దు ఘర్షణ ఇదే.