Donald Trump: ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం.. పశ్చిమాసియాకు వేలాదిగా యూఎస్ బలగాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం త్వరలో సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్‌తో జరుగుతున్న ఈ పోరును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పశ్చిమాసియాలో తమ సైనిక బలగాలను మరింత బలోపేతం చేసేందుకు వేలాదిమంది యూఎస్ సైనికులను అక్కడికి తరలించాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. పశ్చిమాసియాలో అమెరికా కార్యకలాపాలను బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున సైనిక మోహరింపుపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముఖ్యంగా వైమానిక, నావికాదళాల సహాయంతో హర్మూజ్ జలసంధి మీదుగా సాగుతున్న చమురు ట్యాంకర్ల రవాణాకు రక్షణ కల్పించే అంశంపై కూడా చర్చలు జరిగాయి.
Details
ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు
అయితే ఇందుకోసం ఇరాన్ తీర ప్రాంతాల్లో యూఎస్ బలగాలను మోహరించాల్సి రావచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ ద్వీపానికి కూడా యూఎస్ బలగాలను పంపే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమైందని ఒక అమెరికా అధికారి హెచ్చరించారు. ఈ ప్రతిపాదనలన్నింటిపై చర్చలు జరిగినప్పటికీ.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కాగా ఈ అంశంపై పెంటగాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Details
ఇరాన్‌కు చెందిన సుమారు 120 నౌకలను ధ్వంసం
ఇదిలాఉండగా.. గత నెల 28న ప్రారంభమైన యుద్ధం తర్వాత నుంచి ఇరాన్‌పై 7,800కు పైగా దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడుల్లో భాగంగా ఇరాన్‌కు చెందిన సుమారు 120 నౌకలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. యుద్ధంలో ఇప్పటివరకు 13 మంది అమెరికా సైనికులు మృతి చెందగా.. దాదాపు 200 మంది గాయపడ్డారని తెలిపింది.