Loading...
Nepal: నేపాల్‌ను వణికించిన మెరుపు వరదలు.. భారీగా ఆస్తి నష్టం, ఏడుగురు మృతి
నేపాల్‌ను వణికించిన మెరుపు వరదలు.. భారీగా ఆస్తి నష్టం, ఏడుగురు మృతి

Nepal: నేపాల్‌ను వణికించిన మెరుపు వరదలు.. భారీగా ఆస్తి నష్టం, ఏడుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర నేపాల్‌లో బుధవారం ఉదయం సంభవించిన మెరుపు వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. సరిహద్దు ప్రాంతాల్లోని పలు గ్రామాలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు సమాచారం. ఇళ్లు,వంతెనలు,వివిధ ప్రాజెక్టులు,మార్కెట్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందగా.. వందలాది మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. టిబెట్‌ నుంచి ప్రవహించే భోటెకోశీ నది బుధవారం ఉదయం ఒక్కసారిగా ఉద్ధృతంగా మారింది. నదిలో నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరగడంతో రసువా జిల్లాలోని పలు గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని నేపాల్‌ ఆర్మీ వెల్లడించింది.

వివరాలు 

భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతు 

గ్రామాలతో పాటు ఇతర మౌలిక వసతులు కూడా వరదలో కొట్టుకుపోయినట్లు సమాచారం అందిందని రసువా జిల్లా పాలనాధికారి నరేంద్ర పరియర్ తెలిపారు.

భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

వరద ప్రభావిత ప్రాంతం పూర్తిగా పర్వత ప్రాంతం కావడంతో సహాయక, రక్షణ చర్యలు చేపట్టడం సవాల్‌గా మారింది.

అయినప్పటికీ నేపాల్‌ ఆర్మీ రంగంలోకి దిగి ఇప్పటివరకు పలువురిని రక్షించింది. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని బాలెన్‌ షా అత్యవసర సమావేశం నిర్వహించారు.

బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించారు.

వివరాలు 

వర్షం లేకుండానే వరద ఉద్ధృతి

భోటెకోశీ నదిలో ఆకస్మికంగా వచ్చిన ఈ ఉద్ధృతికి సాధారణ వర్షపాతం కారణం కాకపోవడం గమనార్హం.

వర్షాల కారణంగా వరదలు సంభవించలేదని నేపాల్‌ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

దీంతో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎందుకు పెరిగిందనే అంశంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

గతేడాది కూడా రసువా జిల్లాలో భోటెకోశీ నది ఉద్ధృతంగా ప్రవహించడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈసారి సంభవించిన మెరుపు వరదలకు అసలు కారణమేంటన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

హిమానీనద సరస్సు విస్ఫోటనం (Glacial Lake Outburst Flood) వల్ల నదిలో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT