LOADING...
Ali Larijani: 2 వారాలుగా తప్పించుకున్నా.. చివరికి ఇజ్రాయెల్ దాడిలో లారిజానీ మృతి
2 వారాలుగా తప్పించుకున్నా.. చివరికి ఇజ్రాయెల్ దాడిలో లారిజానీ మృతి

Ali Larijani: 2 వారాలుగా తప్పించుకున్నా.. చివరికి ఇజ్రాయెల్ దాడిలో లారిజానీ మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2026
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఆ దేశ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజని హతమయ్యారు. ఇప్పటికే యుద్ధం తొలి రోజున సుప్రీం లీడర్ అలీ ఖ‌మేనీ మృతి చెందగా, టెహ్రాన్‌కు ఇది మరో పెద్ద నష్టం వాటిల్లింది. ఖమేనీ మరణం తర్వాత నుంచి ఇజ్రాయెల్‌ లక్ష్యంగా పెట్టుకున్న లారిజానీ, తరచూ తన స్థావరాలు మార్చుకుంటూ నిఘా వ్యవస్థలకు చిక్కకుండా ఉండేవారు. అయినప్పటికీ పక్కా ఇంటెలిజెన్స్‌ సమాచారంతో ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (IDF) అతడిని గుర్తించి అంతమొందించాయి.

Details

1600 కిలోమీటర్ల దూరం నుంచే దాడి

ఇరాన్‌లో కీలక నేతగా పేరున్న లారిజానీని ట్రాక్‌ చేయడం ఇజ్రాయెల్‌కు సవాలుగా మారింది. గత రెండు వారాలుగా రహస్య ప్రదేశంలో ఉంటూ ఇరాన్‌ సైన్యాన్ని నడిపించిన ఆయన కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను రంగంలోకి దించారు. చివరికి అతడు తన కుమార్తె ఇంట్లో ఉన్నాడని గుర్తించిన నిఘా వర్గాలు ఐడీఎఫ్‌కు సమాచారం అందించాయి. దీంతో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ జమీర్‌ వెంటనే ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు యుద్ధ విమానాలు పంపించి వైమానిక దాడులు జరిపారు. ఈ దాడిలో లారిజానీతో పాటు అతని కుమారుడు కూడా మరణించినట్లు వెల్లడించారు.

Details

ఒకేసారి రెండు ఆపరేషన్లు

లారిజానీపై దాడి జరుగుతున్న సమయంలోనే, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌కు అనుబంధ బసీజ్‌ మిలీషియా అధిపతి ఘోలం రెజా సోలేమానిపై కూడా ఇజ్రాయెల్‌ దాడి చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి ఈ రెండు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఇరాన్‌లో జరిగిన అల్లర్లను అణచివేయడంలో సాల్మనీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Advertisement

Details

లారిజానీ ఎవరు?

1958లో జన్మించిన అలీ లారిజానీ, ఇరాన్‌లో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. సుప్రీం లీడర్‌గా ఉన్న అలీ ఖమేనీకి కుడిభుజంగా వ్యవహరించిన ఆయన, దేశ అణు కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. అలాగే సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శిగా సేవలందించారు. 2025లో ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత మళ్లీ సెక్యూరిటీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి, తాజా ఇజ్రాయెల్‌-అమెరికా దాడులకు వ్యతిరేకంగా ఇరాన్‌ సైన్యాన్ని సమన్వయం చేశారు. ఖమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్‌గా మోజ్తాబా ఖమేనీ ఎన్నికైన నేపథ్యంలో, మతపరమైన కారణాలతో ఆయన నియామకాన్ని లారిజానీ వ్యతిరేకించినట్లు సమాచారం.

Advertisement