Loading...
Chiang Mai: చియాంగ్ మాయి దీపాల పండుగ.. 108 విమానాలు రద్దు, 80 విమానాల సమయాల్లో మార్పులు
చియాంగ్ మాయి దీపాల పండుగ.. 108 విమానాలు రద్దు, 80 విమానాల సమయాల్లో మార్పులు

Chiang Mai: చియాంగ్ మాయి దీపాల పండుగ.. 108 విమానాలు రద్దు, 80 విమానాల సమయాల్లో మార్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్‌లోని చియాంగ్ మాయి నగరంలో జరిగే యీ పెంగ్ దీపాల పండుగ సందర్భంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఈ పండుగలో భాగంగా 2 లక్షలకు పైగా లాంతర్లను గాల్లోకి వదలనున్న నేపథ్యంలో చియాంగ్ మాయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నవంబర్ 21 నుంచి 28 వరకు 108 విమానాలను రద్దు చేశారు. మరో 80 విమానాల సమయాలను మార్చారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఎనిమిది రోజుల్లో అదనంగా 105 ప్రత్యేక విమానాలను కూడా నడపనున్నారు.

వివరాలు 

24-25 తేదీల్లో విమానాల రాకపోకలకు అంతరాయాలు

చియాంగ్ మాయి విమానాశ్రయ అధిపతి గ్రూప్ కెప్టెన్ సకాన్ ఉడోన్ ఈ వివరాలను వెల్లడించినట్లు ఖావ్‌సోడ్ ఇంగ్లిష్ తెలిపింది.

లాంతర్లను గాల్లోకి వదిలే సమయంలో విమానాలు ప్రయాణించకుండా చూడాలని చియాంగ్ మాయి ప్రావిన్స్ అధికారులు విమానయాన సంస్థలను కోరారు.

నవంబర్ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదే రోజు రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 1 గంట వరకు, నవంబర్ 25న కూడా రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు విమానాల రాకపోకలకు అంతరాయాలు కలగచ్చని తెలిపారు.

వివరాలు 

ప్రత్యేక నిబంధనలు అమలు

ఈ ఏడాది పండుగకు సంబంధించి ప్రావిన్స్ అధికారులు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నారు.

నవంబర్ 24, 25 తేదీల్లో రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు మాత్రమే ఆకాశ దీపాలు(లాంతర్లు) ,బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉంటుంది.

నవంబర్ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పొగ దీపాలను వదిలేందుకు అనుమతిస్తారు.

దీపాలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అవి గాల్లో ఏడు నిమిషాలకు మించి ఉండకూడదు.

ఈ నిబంధనల కారణంగా విమానాశ్రయం రోజువారీ కార్యకలాపాల సమయం సుమారు 20 గంటల నుంచి 12 గంటలకు తగ్గనుంది.

ADVERTISEMENT

వివరాలు 

టెర్మినల్‌లో రద్దీ పెరిగే అవకాశం

అయినప్పటికీ పండుగ సమయంలో రోజుకు సగటున 210 విమానాలు,రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో గరిష్ఠంగా 232 విమానాలు నడుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

సాధారణ రోజులతో పోలిస్తే ఇది సుమారు 10 శాతం ఎక్కువ. తక్కువ సమయంలో ఎక్కువ విమానాలు నడపాల్సి రావడంతో ప్రయాణికుల టెర్మినల్‌లో రద్దీ పెరిగే అవకాశం ఉందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

పండుగ సమయంలో ప్రయాణించే వారు ముందుగానే విమాన సమయాలను తనిఖీ చేసుకోవాలని, విమానాశ్రయానికి చేరుకునేందుకు అదనపు సమయం కేటాయించాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు 

స్థానికులు,పండుగ నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలి 

ఆకాశ దీపాలు విడుదల చేసే సమయాలపై పైలట్లకు విమానాశ్రయం ఇప్పటికే సమాచారం అందించింది.

రన్‌వే పరిసరాల్లో దీపాలు,ఇతర వ్యర్థాలు పడే అవకాశం ఉండటంతో తనిఖీలను కూడా పెంచింది.

దీపాలు విమానాలు ప్రయాణించే మార్గాల్లోకి లేదా విమానాశ్రయానికి సమీపంలోకి వస్తే విమానాలకు, ముఖ్యంగా ఇంజిన్లకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని సకాన్ ఉడోన్ హెచ్చరించారు.

దీపాలను ఎక్కడ, ఎప్పుడు వదలాలనే నిబంధనలను స్థానికులు,పండుగ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.

విమానాల టేకాఫ్, ల్యాండింగ్ మార్గాల వెంట ఉన్న రెడ్ జోన్‌లో దీపాలను వదలడంపై పూర్తిగా నిషేధం ఉంది.

2025లో ఈ రెడ్ జోన్ పరిధిలో ఆరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉండగా,చియాంగ్ మాయి నగరం, హాంగ్ డాంగ్ మొత్తం ఈ పరిధిలోకి వచ్చాయి.

వివరాలు 

నిబంధనలు ఉల్లంఘించిన వారికి..

నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, 2 లక్షల భాట్‌ల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని థైగర్ తెలిపింది.

గత ఏడాది నవంబర్ 5, 6 తేదీల్లో దీపాలను వదిలిన సమయంలో విమానాశ్రయంలో 65 విమానాలను రద్దు చేయగా, మరో 96 విమానాల సమయాలను మార్చారు.

యీ పెంగ్ పండుగ ఉత్తర థాయ్‌లాండ్‌లో జరుపుకునే లన్నా సంప్రదాయంలో భాగం.

లాయ్ క్రథాంగ్ పండుగతో పాటు జరుపుకునే ఈ వేడుకకు థాయ్‌లాండ్‌తో పాటు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

ADVERTISEMENT