LOADING...
Shaksgam Valley: షాక్స్‌గామ్ వ్యాలీపై చైనా అక్కసు.. భారత్‌తో మరో వివాదం
షాక్స్‌గామ్ వ్యాలీపై చైనా అక్కసు.. భారత్‌తో మరో వివాదం

Shaksgam Valley: షాక్స్‌గామ్ వ్యాలీపై చైనా అక్కసు.. భారత్‌తో మరో వివాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో కీలక వ్యూహాత్మక ప్రాంతంగా భావించే షాక్స్‌గామ్ వ్యాలీపై చైనా మరోసారి తన వైఖరిని బయటపెట్టింది. ఈ ప్రాంతంలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులపై భారత్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను చైనా పూర్తిగా తిరస్కరించింది. షాక్స్‌గామ్ వ్యాలీలో రహదారులు సహా ఇతర నిర్మాణాలను చైనా వేగంగా ముందుకు తీసుకెళ్తుండటంతో, దీనిపై భారత విదేశాంగ శాఖ గట్టి స్పందన వ్యక్తం చేసింది. షాక్స్‌గామ్ వ్యాలీ భారత భూభాగంలో విడదీయరాని భాగమని, అయితే 1963లో పాకిస్థాన్ అక్రమంగా 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్నిచైనాకు అప్పగించిందని భారత్ స్పష్టం చేసింది. ఆ ఒప్పందాన్ని భారత్ ఇప్పటివరకు ఎప్పుడూ అంగీకరించలేదని మరోసారి గుర్తు చేసింది.

వివరాలు 

అభివృద్ధి పనులపై ఇతర దేశాలకు అభ్యంతరం చెప్పే హక్కు లేదు: మావో నింగ్

ఈ నేపథ్యంలో సోమవారం చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ, షాక్స్‌గామ్ వ్యాలీ చైనా భూభాగమేనని, తమ భూమిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఇతర దేశాలకు అభ్యంతరం చెప్పే హక్కు లేదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ తన అక్రమ ఆక్రమణలో ఉన్న భారత భూభాగాన్ని చైనాకు అప్పగిస్తూ 1963లో చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని కుదుర్చుకుందని, అది చట్టవిరుద్ధమని భారత్ మొదటి నుంచీ వాదిస్తోంది. ఇదే ప్రాంతం గుండా సాగుతున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపెక్) పథకాన్ని కూడా భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తోందన్నది భారత అభిప్రాయం.

వివరాలు 

కాశ్మీర్ అంశంపై చైనా ద్వంద్వ ధోరణి 

కాశ్మీర్ అంశంపై చైనా ద్వంద్వ ధోరణి అవలంబిస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తన వ్యాఖ్యల్లో చైనా కాశ్మీర్ వివాదాన్ని ప్రస్తావిస్తూ, ఇది చరిత్ర నుంచి కొనసాగుతున్న సమస్య అని, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ఆధారంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తెలిపింది. అయితే వివాదాస్పద ప్రాంతంలో అమలు చేస్తున్న సీపెక్ ప్రాజెక్టులు కేవలం ఆర్థిక అభివృద్ధి కోసమేనని, వాటితో కాశ్మీర్ అంశంపై తమ వైఖరి మారదని చైనా స్పష్టం చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీనికి భారత్ గట్టిగా ప్రతిస్పందించింది.

Advertisement

వివరాలు 

దేశ ప్రయోజనాలను రక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉంది 

భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, జమ్మూ-కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిగా భారతదేశంలో విడదీయలేని భాగాలేనని తేల్చి చెప్పారు. దేశ ప్రయోజనాలను రక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొంత తగ్గుతున్న పరిస్థితుల్లో, ఇప్పుడు షాక్స్‌గామ్ వ్యాలీ అంశం మళ్లీ పెద్ద వివాదానికి దారితీస్తోంది.

Advertisement