LOADING...
Board of Peace: గాజా కోసం ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'… 1 బిలియన్ డాలర్లు ఇస్తేనే శాశ్వత సభ్యత్వమా?
1 బిలియన్ డాలర్లు ఇస్తేనే శాశ్వత సభ్యత్వమా?

Board of Peace: గాజా కోసం ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'… 1 బిలియన్ డాలర్లు ఇస్తేనే శాశ్వత సభ్యత్వమా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాజా భవిష్యత్తును పర్యవేక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 'బోర్డ్ ఆఫ్ పీస్'లో శాశ్వత సభ్యత్వం పొందాలంటే 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందా అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ బోర్డులో చేరేందుకు అమెరికా ఇప్పటికే కనీసం ఎనిమిది దేశాలకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. వాటిలో హంగరీ, వియత్నాం దేశాలు తమ అంగీకారాన్ని వెల్లడించాయి. ట్రంప్ నేతృత్వంలోని ఈ బోర్డులో మూడేళ్ల కాలపరిమితితో సభ్యత్వం పొందితే ఎలాంటి ఆర్థిక సహాయం అవసరం లేదు. అయితే శాశ్వత సభ్యత్వం కావాలంటే కనీసం 1 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సి ఉంటుందని,ఈ బోర్డు చార్టర్‌పై అవగాహన ఉన్న ఓ అమెరికా అధికారి గోప్యంగా వెల్లడించారు.

వివరాలు 

బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరేందుకు హంగరీ ప్రధాని విక్టర్ ఆర్బాన్ అంగీకారం 

ఈ నిధులను గాజా పునర్నిర్మాణానికి వినియోగిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఆ చార్టర్‌ను అధికారికంగా విడుదల చేయలేదు. ఈ బోర్డులో చేరేందుకు హంగరీ ప్రధాని విక్టర్ ఆర్బాన్ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి పీటర్ సిజార్టో ఆదివారం తెలిపారు. యూరప్‌లో ట్రంప్‌కు బలమైన మద్దతుదారుల్లో ఆర్బాన్ ఒకరు. అలాగే వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి టో లామ్ కూడా ఈ ఆహ్వానాన్ని స్వీకరించినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత్‌కు కూడా ఆహ్వానం అందినట్లు ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఆస్ట్రేలియాకు కూడా అమెరికా ఆహ్వానం పంపింది.

వివరాలు 

బోర్డు ఆహ్వానం అందిందని వెల్లడించిన ఈ దేశాలు 

దీనిపై పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ చెప్పారు. జోర్డాన్, గ్రీస్, సైప్రస్, పాకిస్తాన్ దేశాలు కూడా తమకు ఆహ్వానం అందిందని వెల్లడించాయి. ఇప్పటికే కెనడా, టర్కీ, ఈజిప్ట్, పరాగ్వే, అర్జెంటీనా, అల్బేనియా వంటి దేశాలు కూడా ఆహ్వానాలు అందుకున్నట్లు చెప్పాయి. మొత్తం ఎన్ని దేశాలను ఈ బోర్డులోకి ఆహ్వానించారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెలాఖరులో స్విట్జర్లాండ్‌లోని డావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల సందర్భంగా బోర్డ్ ఆఫ్ పీస్‌కు సంబంధించిన అధికారిక సభ్యుల జాబితాను అమెరికా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

బోర్డు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం

అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ రెండో దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో, గాజాలో తదుపరి చర్యలను ఈ బోర్డు పర్యవేక్షించనుంది. గాజాలో కొత్త పాలస్తీనా కమిటీ ఏర్పాటు, అంతర్జాతీయ భద్రతా దళాల మోహరింపు, హమాస్ నిరాయుధీకరణ, యుద్ధంతో దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణం వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. ప్రపంచ నాయకులకు పంపిన లేఖల్లో, 'స్థాపక సభ్యులు'గా చేరాలని ట్రంప్ కోరారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలకు పరిష్కారం చూపే దిశగా ధైర్యమైన కొత్త విధానాన్ని ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ బోర్డు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

వివరాలు 

నిధులు తగ్గించడంతో ప్రభావం తగ్గిన ఐక్యరాజ్యసమితి

15 సభ్యులతో కూడిన భద్రతా మండలి గాజా యుద్ధంపై చర్యలు తీసుకోవడంలో అమెరికా వెటో కారణంగా విఫలమైంది. మరోవైపు, ట్రంప్ ప్రభుత్వం సహా పలువురు దాత దేశాలు నిధులు తగ్గించడంతో ఐక్యరాజ్య సమితి ప్రభావం కూడా తగ్గింది. బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటు అమెరికా ప్రతిపాదించిన 20 అంశాల గాజా కాల్పుల విరమణ ప్రణాళికలో భాగమేనని ట్రంప్ లేఖల్లో పేర్కొన్నారు. ఈ లేఖలను కొంతమంది ఆహ్వానితులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదిలా ఉండగా, బోర్డ్ ఆఫ్ పీస్ లక్ష్యాలను అమలు చేయడానికి ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వైట్ హౌస్ గత వారం ప్రకటించింది.

వివరాలు 

ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా..

అయితే ఈ కమిటీ ఏర్పాటుపై ఇజ్రాయెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమతో సంప్రదింపులు లేకుండా ఇది ఏర్పాటు చేశారని, ఇది తమ విధానాలకు విరుద్ధమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం తెలిపింది. ఇది వాషింగ్టన్‌తో సన్నిహిత మిత్రత్వం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన అరుదైన విమర్శగా భావిస్తున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక దౌత్య ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, అమెరికా ఉప జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ గేబ్రియల్, అలాగే ఇజ్రాయెల్‌కు చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త యాకిర్ గాబే సభ్యులుగా ఉన్నారు.

వివరాలు 

ఈ కమిటీలో ఖతార్, ఈజిప్ట్, టర్కీ దేశాల ప్రతినిధులు

అలాగే కాల్పుల విరమణను పర్యవేక్షిస్తున్న ఖతార్, ఈజిప్ట్, టర్కీ దేశాల ప్రతినిధులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలు అంతగా సానుకూలంగా లేకపోయినా, హమాస్‌తో మంచి సంబంధాలు ఉన్న టర్కీ, గాజాలో హమాస్ అధికారాన్ని వదిలి నిరాయుధీకరణకు ఒప్పించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement