Loading...
Mark Carney: కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది: ప్రధాని కార్నీ సంచలన వ్యాఖ్యలు
కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది: ప్రధాని కార్నీ సంచలన వ్యాఖ్యలు

Mark Carney: కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది: ప్రధాని కార్నీ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడాలోని ఆల్బెర్టా ప్రావిన్స్‌లో అక్టోబర్ 19న జరగనున్న రిఫరెండం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆల్బెర్టా కెనడాలోనే కొనసాగేందుకు ప్రజలు ఓటు వేయాలని కార్నీ కోరారు. దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకుంటే.. ఆ ప్రాంతం విభజనతో పాటు భవిష్యత్తులో అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయని, పలు దేశాలు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని కార్నీ పేర్కొన్నారు.

వివరాలు 

అమెరికా, కెనడా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు

''మన సరిహద్దులకు అవతల ఉన్నవారు కెనడాను విచ్ఛిన్నం చేసి తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రిఫరెండం జరగడం ఏమాత్రం అనుకూలం కాదు. ఈ ఓటింగ్‌లో నిర్ణయాత్మక ఫలితం వస్తే వేర్పాటువాద సమస్యకు పరిష్కారం లభిస్తుంది.అదే ఆల్బెర్టా విడిపోవడానికి అనుకూలంగా ఓటు వేస్తే.. ఏళ్ల తరబడి అనిశ్చితి కొనసాగుతుంది'' అని ఆయన ప్రజలను హెచ్చరించారు.

ప్రస్తుతం అమెరికా,కెనడా మధ్య వాణిజ్య వివాదాలు కొనసాగుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పలుమార్లు కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని కార్నీ గతంలోనే తీవ్రంగా స్పందించారు.

మరోవైపు,కెనడా నుంచి ఆల్బెర్టా విడిపోవాలని ప్రపంచ కుబేరుడు మస్క్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి.

వివరాలు 

ఆల్బెర్టాలో వేర్పాటువాదానికి కారణాలివే..

ఈ పరిణామాలు కెనడా సమగ్రతపై చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి.

ఆల్బెర్టా చమురు, సహజవాయువు నిల్వలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం.

కెనడా ఆర్థిక వ్యవస్థకు తాము గణనీయమైన ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ, తమకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, నిధులు లభించడం లేదని అక్కడి ప్రజల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక అసమానతలు, ఫెడరల్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాజకీయ విభేదాలు వేర్పాటువాద ఆలోచనలకు బలాన్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 19న ఆల్బెర్టాలో ఓటింగ్ జరగనుంది. కెనడా నుంచి విడిపోయే ప్రక్రియను చట్టబద్ధంగా ప్రారంభించాలా? వద్దా? అనే అంశంపై ఈ ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ ఫలితం కెనడా ఐక్యతతో పాటు ఆల్బెర్టా భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ADVERTISEMENT