China cargo ship: తైవాన్ టెన్షన్ మధ్య చైనా సంచలన అడుగు.. కార్గో నౌకలకు డ్రోన్లు, క్షిపణి లాంచర్లు..?
ఈ వార్తాకథనం ఏంటి
చైనా తన సాధారణ కార్గో నౌకలను డ్రోన్లు, క్షిపణి లాంచర్లతో యుద్ధ అవసరాలకు సిద్ధం చేస్తోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఓ కార్గో షిప్‌పై డ్రోన్లు, క్షిపణి లాంచర్లు అమర్చినట్టుగా కనిపిస్తున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇది చైనా నౌకాదళ వ్యూహాల్లో కీలక మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. మారిటైమ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ల సమాచారం ప్రకారం, 'జోంగ్డా 79' (Zhongda 79) అనే కార్గో షిప్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (PLAN)కి చెందిన హెలికాప్టర్ దర్శనమిచ్చింది.
వివరాలు
కార్గో నౌకపై మాడ్యులర్ ఎలక్ట్రోమాగ్నటిక్ క్యాటపల్ట్ సిస్టమ్
ఈ నౌకను ప్రస్తుతం క్షిపణులు ప్రయోగించే ఆయుధ నౌకగా మార్చుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో తైవాన్ చుట్టూ చైనా భారీ స్థాయిలో నౌకా, వైమానిక విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను పెద్ద ఎత్తున మోహరించింది. ఈ కార్గో నౌకపై మాడ్యులర్ ఎలక్ట్రోమాగ్నటిక్ క్యాటపల్ట్ సిస్టమ్‌ను అమర్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవస్థను ఫైటర్ డ్రోన్లను లాంచ్ చేయడానికి ఉపయోగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, నౌకపై ఇతర లాంచింగ్ వ్యవస్థలు, ఆధునిక రాడార్ పరికరాలు కూడా కనిపించినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి.
వివరాలు
చైనా వద్ద 370కి పైగా యుద్ధ నౌకలు
యూఎస్‌ఎన్‌ఐ న్యూస్ నివేదిక ప్రకారం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళంగా ఉంది. చైనా వద్ద 370కి పైగా యుద్ధ నౌకలు ఉండగా, అమెరికా వద్ద సుమారు 290 యుద్ధ నౌకలే ఉన్నాయి. అయితే సాంకేతిక పరంగా ఇప్పటికీ అమెరికా నౌకాదళానికే ఆధిక్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ఆధిపత్యాన్ని అధిగమించే దిశగా చైనా వేగంగా తన నౌకాదళాన్ని విస్తరిస్తోంది. ముఖ్యంగా చైనా వద్ద సుమారు 4 వేల వాణిజ్య నౌకలు ఉండటం గమనార్హం. అవసరమైతే ఈ వాణిజ్య నౌకలను తక్కువ సమయంలోనే యుద్ధ నౌకల తరహాలోకి మార్చే సామర్థ్యం చైనాకు ఉండటం రక్షణ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.