China is living in 2080: 'చైనా 2080లో జీవిస్తోంది'.. డ్రైవర్‌లెస్ కార్ల వినియోగం: ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇప్పటికీ డ్రైవర్‌లెస్ లేదా ఏఐ ఆధారిత కార్లకు అనుమతి లేదు. కొన్ని చోట్ల పూర్తిగా నిషేధం కూడా ఉంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే, ఈ విషయంలో చైనా ఎంత ముందుందో స్పష్టంగా అర్థమవుతోంది. ఒక నిమిషానికి పైగా ఉన్న ఈ వీడియోలో చైనాలోని వివిధ నగరాల్లో తీసిన దృశ్యాలు ఉన్నాయి. రోడ్డుపై లేదా పార్కింగ్‌లో ఉన్న కార్ల దగ్గరకు వెళ్లినప్పుడు,యజమానులు కేవలం చేతి సంజ్ఞలు చేస్తే చాలు-కారు తలుపులు ఆటోమేటిక్‌గా తెరుచుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే కారే స్వయంగా యజమాని దగ్గరకు వస్తోంది.
వివరాలు
తలుపు హ్యాండిల్స్ పట్టుకోవడం గానీ, బటన్ నొక్కడం గానీ అవసరం లేదు
ఇందులో కనిపించే వాహనాలు ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లే.. కాగా, లీ ఆటో(Li Auto),నీయో (NIO),ఏఐటీఓ / ఆస్క్(AITO/Ask)M9 వంటి మోడళ్లను వీడియోలో చూపించారు. ఈ వీడియోలో పురుషులు,మహిళలు రోడ్డుపై పార్క్ చేసిన ఎస్‌యూవీలు,సెడాన్ల దగ్గరకు నడుచుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. వారు దూరం నుంచే చేతితో సంకేతం ఇస్తే,తలుపులు తెరుచుకుంటాయి లేదా కారు వారివద్దకు నెమ్మదిగా వస్తుంది. తలుపు హ్యాండిల్స్ పట్టుకోవడం గానీ, బటన్ నొక్కడం గానీ అవసరం లేదు. మరికొన్ని క్లిప్‌లలో అయితే,యజమాని ఎత్తుకు సరిపడేలా అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ ద్వారా కారు కొంచెం దిగువకు వంగి,ఎక్కడం మరింత సులభంగా మారుతోంది. ఈ అద్భుతాలకు కారణమైన సాంకేతికతల్లో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, రిమోట్ సమన్, మెమరీ పార్కింగ్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
వివరాలు
యజమానిని గుర్తించి స్వాగతం పలుకుతున్నట్టుగా..
యజమాని కారు దగ్గరకు రాగానే హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, లోపల అంబియంట్ లైటింగ్ స్వయంగా ఆన్ అవుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. చూస్తుంటే కారు తన యజమానిని గుర్తించి స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపిస్తోంది. అంతేకాదు, వెనుక భాగంలో బ్యాగులు లేదా కూరగాయల సంచులతో నడిచివచ్చినప్పుడు డిక్కీ (బూట్) ఆటోమేటిక్‌గా తెరుచుకునే సన్నివేశాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. కష్టమైన పార్కింగ్ ప్రదేశాల నుంచి కార్లు తానే బయటకు రావడం కూడా చూపించారు. తలుపులు, సస్పెన్షన్‌కు సంబంధించిన అధునాతన ఫీచర్లు ఈ కార్లలో ఇప్పటికే సాధారణంగా మారిపోయాయని వీడియో స్పష్టం చేస్తోంది.
వివరాలు
ఈ మోడళ్లలో అందుబాటులో..
ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి కలిగిన అభిప్రాయం ఏంటంటే - ఇవన్నీ చైనాలో ఇప్పటికే సాధారణ జీవనశైలిలో భాగమైపోయాయి, మిగతా ప్రపంచం మాత్రం చాలా వెనుకబడి ఉందన్న భావన. అందుకే వీడియోపై 'చైనా 2080లో జీవిస్తోంది' అనే క్యాప్షన్‌ను కూడా పెట్టారు. ఆటో పవర్ డోర్లు, ఆటో లో-ఎంట్రీ సస్పెన్షన్, చేతి సంజ్ఞలు లేదా నడుచుకుంటూ వస్తే గుర్తించే టెక్నాలజీ, వెల్‌కమ్ లైట్స్ వంటి ఫీచర్లు ఇప్పుడు లీ ఆటో L సిరీస్, ఏఐటీఓ M9, అలాగే కొన్ని నీయో, జీకర్ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ కాన్సెప్ట్ కార్లు కావు, ఊహాత్మక మోడళ్లూ కావు - ఇప్పటికే రోడ్లపై నడుస్తున్న నిజమైన వాహనాలే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చైనా 2080లో జీవిస్తోంది
Wow, China is living in 2080 pic.twitter.com/NVuf01hbhO
— Wholesome Side of 𝕏 (@itsme_urstruly) January 18, 2026