LOADING...
Chinese Woman:బతికున్న కప్పలను మింగితే నడుం నొప్పి తగ్గుతుందా? 8 బతికున్న కప్పలను అమాంతం మింగేసిన మహిళ..ఆ తర్వాత ఏమి జరిగిందంటే?
8 బతికున్న కప్పలను అమాంతం మింగేసిన మహిళ.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే?

Chinese Woman:బతికున్న కప్పలను మింగితే నడుం నొప్పి తగ్గుతుందా? 8 బతికున్న కప్పలను అమాంతం మింగేసిన మహిళ..ఆ తర్వాత ఏమి జరిగిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2025
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. నడుం నొప్పి తగ్గుతుందనే నమ్మకంతో ఒక వృద్ధురాలు నాటు వైద్యాన్ని ఆశ్రయించింది. అయితే, ఆ చికిత్స కోసం ఆమె తీసుకున్న చర్యలు మాత్రం ప్రాణాపాయానికి దారితీశాయి. నడుం నొప్పి తగ్గుతుందని భావించి, ఏకంగా ఎనిమిది కప్పలను పట్టి వాటిని జీవంగా మింగేసింది. కానీ నొప్పి తగ్గకపోగా, కడుపు నొప్పితో విలవిలలాడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.

వివరాలు 

నాటు వైద్యుల సూచన

తూర్పు చైనాకు చెందిన 82 ఏళ్ల జాంగ్ అనే వృద్ధురాలు చాలా కాలంగా హెర్నియేటెడ్ డిస్క్ సమస్యతో బాధపడుతోంది. వెన్నునొప్పి తగ్గాలంటే బతికున్న కప్పలను మింగితే ఉపయోగమవుతుందని స్థానిక నాటు వైద్యులు ఆమెకు సూచించారు. ఆ మాట నమ్మిన జాంగ్, అసలు విషయం చెప్పకుండా కుటుంబ సభ్యులను తన కోసం కప్పలను పట్టుకుని రమ్మని కోరింది. అవి పెద్దవారి అరచేతి కంటే కొద్దిగా చిన్నగా ఉండాలని కూడా ఆమె ప్రత్యేకంగా చెప్పిందని సమాచారం.

వివరాలు 

కడుపులో కప్పలు ఉండటం చూసి ఆశ్చర్యపోయిన వైద్యులు 

ఆమె మాట విని కుటుంబ సభ్యులు కప్పలను పట్టుకుని తెచ్చారు. వాటిని శుభ్రం చేయకుండానే, వేడి నీటిలో ఉడకబెట్టకుండానే జాంగ్ వాటిని సజీవంగానే మింగేసింది. గత సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి రోజు మూడు కప్పలను,తదుపరి రోజు ఐదు కప్పలను ఒకదాని తర్వాత ఒకటి మింగేసిందని తెలుస్తోంది. కొంతసేపటికే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి ప్రారంభమైంది. నడుం నొప్పి తగ్గకపోగా,శరీరం నొప్పులతో నిండిపోయింది. చివరకు కడుపు నొప్పిని భరించలేక కుటుంబ సభ్యులను పిలిచి తాను జీవ కప్పలను మింగిన విషయాన్ని జాంగ్ స్వయంగా వెల్లడించింది. దాంతో కుటుంబ సభ్యులు తక్షణమే ఆమెను హాంగ్జౌలోని జెజియాంగ్ యూనివర్సిటీ ఫస్ట్ అఫిలియేటెడ్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో కప్పలు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

వివరాలు 

రెండు వారాలపాటు చికిత్స పొందిన తర్వాత కోలుకున్న జాంగ్

కప్పల వల్ల టేప్‌వార్మ్ లార్వా (స్పార్గనమ్) అనే పరాన్నజీవులు ఆమె శరీరంలోకి ప్రవేశించాయని, అదనంగా బ్యాక్టీరియా సంక్రమణ కూడా జరిగిందని గుర్తించారు. సజీవ కప్పలను మింగడం వలన ఆమె జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని,ఇన్‌ఫెక్షన్ కారణంగా శరీరంలో పరాన్నజీవులు వ్యాపించాయని వైద్యులు వివరించారు. రెండు వారాలపాటు చికిత్స పొందిన తర్వాత ఆమె కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. వైద్యులు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ.. ఎటువంటి వ్యాధి ఉన్నా సరైన వైద్య చికిత్స కోసం ఆస్పత్రిని సంప్రదించాలే గాని,అవగాహన లేకుండా నాటు వైద్యాలను అనుసరించడం ప్రమాదకరమని సూచించారు. "కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు" అవగాహనలేని చర్యలు శరీరానికి అపాయం కలిగిస్తాయని వారు స్పష్టం చేశారు.