John Ratcliffe: 'మిస్టరీ' విమానంలో సీఐఏ చీఫ్.. రష్యాలో జాన్ రాట్‌క్లిఫ్ రహస్య పర్యటన
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా ఉన్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ రష్యా రాజధాని మాస్కోలో రహస్యంగా పర్యటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మంగళవారం రష్యాలో అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం ల్యాండ్ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ 'మిస్టరీ' విమానంలో సీఐఏ చీఫ్ రాట్‌క్లిఫ్ వచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాలు
ఉక్రెయిన్ దాడులకు విరామం..
రాట్‌క్లిఫ్ మాస్కో పర్యటనకు ముందు ఉక్రెయిన్ డ్రోన్లు, క్షిపణులతో రష్యాపై దాడులు చేయకుండా అమెరికా కోరినట్లు సమాచారం.
తమ సీనియర్ అధికారి ఒకరు రష్యాలో పర్యటించనున్నట్లు గత సోమవారం అమెరికా నుంచి సమాచారం అందిందని కీవ్ కూడా వెల్లడించింది.
విమానాల ట్రాకింగ్ వివరాల ప్రకారం.. రాట్‌క్లిఫ్ సుమారు ఎనిమిది గంటల పాటు మాస్కోలో ఉన్నారు.
అయితే, ఇంత కీలకమైన పర్యటనకు ఆయన సాధారణ విమానాన్ని కాకుండా అమెరికా సైనిక రవాణా విమానాన్ని ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భద్రతా కారణాలతోనే ఈ మార్గాన్ని ఎంచుకుని ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
వివరాలు
ఉక్రెయిన్ దాడులకు విరామం..
బోయింగ్ సి-17 గ్లోబ్‌మాస్టర్-3 విమానం వ్నూకోవ్ విమానాశ్రయంలో దిగిన వెంటనే దౌత్య నంబరు ప్లేట్లు కలిగిన ఓ కాన్వాయ్ అక్కడికి చేరుకున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
అయితే, మాస్కోలో రాట్‌క్లిఫ్ ఎవరిని కలిశారనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఈ అంశంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ స్పందించింది.
ఆ అమెరికా సైనిక విమానం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
ఈ వారంలో అమెరికా ప్రతినిధులతో క్రెమ్లిన్‌లో ఎలాంటి సమావేశాలు కూడా తమ ప్రణాళికలో లేవని చెప్పారు. మరోవైపు, సీఐఏ మాత్రం ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు.
వివరాలు
ఎందుకు వెళ్లారు?
ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా నిఘా సంస్థ అధిపతి మాస్కోకు వెళ్లడం సహజంగానే చర్చకు దారితీసింది.
రాట్‌క్లిఫ్ పర్యటన వెనుక అసలు కారణం ఏమిటన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇరాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరి చేయడమే లక్ష్యంగా అమెరికా ఇటీవల 'ఆపరేషన్ ఎకనమిక్ అవుట్‌కాస్ట్'ను ప్రకటించింది.
ఇందులో భాగంగా టెహ్రాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపై పలు ఆంక్షలు విధించనుంది.
వివరాలు
ఎందుకు వెళ్లారు?
ఇరాన్‌కు రష్యా కీలక వ్యూహాత్మక వాణిజ్య భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో.. ఈ అంశంపై చర్చించేందుకే రాట్‌క్లిఫ్ మాస్కోకు వెళ్లి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు.. నాటో సభ్య దేశంపై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరించాయి.
మాస్కో నాటో దేశంపై సైబర్ దాడులు, రహస్య ఆపరేషన్లు లేదా పరిమిత స్థాయి సైనిక దురాక్రమణకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
ఈ ముప్పుపై రష్యా అధికారులతో చర్చించేందుకే సీఐఏ చీఫ్ మాస్కోకు వచ్చి ఉండవచ్చనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
వివరాలు
బైడెన్ హయాంలోనూ ఇదే తరహా పర్యటన..
సీఐఏ డైరెక్టర్ రహస్యంగా రష్యాను సందర్శించడం ఇదే తొలిసారి కాదు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో 2021 నవంబర్‌లో అప్పటి సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ మాస్కోలో పర్యటించారు.
ఆ సమయంలో రష్యా.. ఉక్రెయిన్‌పై భారీ సైనిక చర్యకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బర్న్స్ నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు.
ఉక్రెయిన్‌పై దాడికి దిగితే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
అయినప్పటికీ అమెరికా హెచ్చరికలను రష్యా పట్టించుకోలేదు. చివరకు 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రారంభించింది.
తాజా పరిణామాల్లోనూ సీఐఏ చీఫ్ రాట్‌క్లిఫ్ మాస్కో పర్యటనకు స్పష్టమైన కారణం వెల్లడికాకపోవడంతో.. ఈ రహస్య పర్యటన అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.