Hezbollah: ఇజ్రాయెల్‌కు భారీ షాక్.. ఐరన్ డోమ్‌పై హెజ్‌బొల్లా దాడి!
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థ 'ఐరన్ డోమ్'ను హెజ్‌బొల్లా లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో మోహరించి ఉన్న ఐరన్ డోమ్ వ్యవస్థపై కొద్ది రోజుల క్రితం హెజ్‌బొల్లా దాడి నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో ఫస్ట్ పర్సన్ వ్యూ (FPV) డ్రోన్‌ను వినియోగించినట్లు సమాచారం. పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండే ఈ డ్రోన్లను గుర్తించి కూల్చివేయడంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ డ్రోన్లకు ప్రత్యేక కేబుల్ వ్యవస్థ ఉండటంతో ఇజ్రాయెల్ ఉపయోగించే జామింగ్ టెక్నాలజీ కూడా పనిచేయలేదని నివేదికలు సూచిస్తున్నాయి.
వివరాలు
రక్షణ వ్యవస్థకు భారీ నష్టం
ఇలాంటి ఎఫ్‌పీవీ డ్రోన్లలో ఒకటి ఐరన్ డోమ్ బ్యాటరీని నేరుగా ఢీకొట్టినట్లు హెజ్‌బొల్లా విడుదల చేసిన వీడియోలో కనిపించింది. దీంతో ఆ రక్షణ వ్యవస్థకు నష్టం వాటిల్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు ఇటీవలి కాలంలో ఎఫ్‌పీవీ డ్రోన్ల ముప్పు పెరుగుతుండటంతో ఇజ్రాయెల్ రక్షణ దళాలు కూడా వాటిని ఎదుర్కొనే వ్యూహాలపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ రాన్ కోచవ్ డ్రోన్ల వల్ల పెరుగుతున్న ముప్పుపై హెచ్చరికలు జారీ చేసిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.