LOADING...
Venezuela Earthquake: భూకంప శిథిలాల నుంచి 79 ఏళ్ల బామ్మను రక్షించిన భారత సైన్యం
భూకంప శిథిలాల నుంచి 79 ఏళ్ల బామ్మను రక్షించిన భారత సైన్యం

Venezuela Earthquake: భూకంప శిథిలాల నుంచి 79 ఏళ్ల బామ్మను రక్షించిన భారత సైన్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెనిజులాను వణికించిన జంట భూకంపాల అనంతరం చోటుచేసుకున్న హృదయాన్ని కదిలించే ఘటనలో 79 ఏళ్ల వృద్ధురాలు మృత్యువును జయించింది. అనేక రోజుల పాటు భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆమెను భారత సైన్యం (Indian Army) సురక్షితంగా వెలికితీసింది. వెనెజువెలాలో మానవతా సహాయక చర్యల కోసం చేపట్టిన 'ఆపరేషన్ అమిస్తాద్' (Operation Amistad)లో భాగంగా ఈ రక్షణ చర్య విజయవంతమైందని భారత సైన్యం బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. భారత సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. భవన శిథిలాల కింద చిక్కుకున్న 79ఏళ్ల వృద్ధురాలిని సజీవంగా బయటకు తీసి,ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనం కూలిన ఘటనలో ఆమె కాలుకు తీవ్ర గాయం కావడంతో పాటు ఎముక విరిగింది.

వివరాలు 

'ఆపరేషన్ అమిస్తాద్' పేరుతో ప్రత్యేక విమానం

కొన్ని రోజులుగా ఆహారం, తాగునీరు, వైద్యసహాయం అందక తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెకు రక్షించిన వెంటనే వైద్య బృందం అత్యాధునిక చికిత్స ప్రారంభించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వెనెజువెలా ప్రజలకు అవసరమైన మానవతా సహాయాన్ని అందించేందుకు భారత్ కట్టుబడి ఉందని భారత సైన్యం ఎక్స్ పోస్టులో పేర్కొంది. సహాయక చర్యలు, వైద్య సేవలు నిరంతరం కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఇటీవల సంభవించిన జంట భూకంపాలతో వెనెజువెలాలో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఈ విపత్తు అనంతరం భారత్ వెంటనే స్పందించి, 'ఆపరేషన్ అమిస్తాద్' పేరుతో ప్రత్యేక విమానం ద్వారా సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర వైద్య సామగ్రిని అక్కడికి పంపించి సహాయక చర్యలు చేపట్టింది.

Advertisement