South Korea's Jeju Island: జెజు ద్వీపంలో కలకలం.. మూడు రోజుల్లో నాలుగు మృతదేహాలు లభ్యం!
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం జెజు ద్వీపంలో వరుసగా మృతదేహాలు బయటపడటం కలకలం రేపుతోంది. కేవలం మూడు రోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తుల మృతదేహాలు లభించడంతో అక్కడ ఏం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో పది మందికి పైగా అదృశ్యం కావడం, కొందరు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడంతో జెజులో సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. పోలీసుల దర్యాప్తు తీరుపై కూడా విమర్శలు రావడంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ఈ వ్యవహారంపై స్పందించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు.
వివరాలు
జెజు ద్వీపంలో సీరియల్ కిల్లర్ ఉన్నాడనే ప్రచారానికి.. లభించని ఆధారాలు
మే 12నుంచి కనిపించకుండా పోయిన 37ఏళ్ల జాంగ్ మి-రాన్ అనే మహిళ మృతదేహం సోమవారం (ఆగస్టు 24)హల్లిమ్-యుప్‌లోని ఓ తాటి తోటలో గుర్తించారు.
అప్పటికే శరీరం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. శవపరీక్ష నిర్వహించిన అధికారులు మృతురాలు జాంగ్ మి-రాన్ అని నిర్ధారించారు.
ఆమె ఉరి వేసుకుని మృతిచెంది ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే,అసలు మరణానికి కారణమేంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే జెజు ద్వీపంలో సీరియల్ కిల్లర్ ఉన్నాడనే ప్రచారానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు చెబుతున్నారు.
వరుసగా మృతదేహాలు బయటపడటంతో సామాజికమాధ్యమాల్లో అనుమానాలు పెరుగుతున్నప్పటికీ,ఈ ఘటనలన్నింటికీ ఒకే వ్యక్తి లేదా ఒకే కారణం ఉందని నిర్ధారించే ఆధారాలు దర్యాప్తులో బయటపడలేదని స్పష్టం చేశారు.
వివరాలు
17నెలల కాలంలో 298మిస్సింగ్ కేసులు
ఇదిలా ఉంటే.. జెజులో నమోదైన అదృశ్యం కేసుల దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం వెలుగులోకి రావడం మరింత వివాదానికి దారితీసింది.
సుమారు 17నెలల కాలంలో 298మిస్సింగ్ కేసులను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి తీవ్ర అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
జాంగ్ మి-రాన్ కేసులో ఆమెతో మాట్లాడినట్లు తప్పుడు సమాచారం నమోదు చేయడంతో పాటు, తగిన ఆధారాలు లేకుండానే కేసును ముగించినట్లు దర్యాప్తులో తేలింది.
అంతేకాకుండా సంబంధిత రికార్డులను కూడా తొలగించినట్లు గుర్తించారు. ఆగస్టు 22న మృతదేహంగా కనిపించిన 60ఏళ్ల వృద్ధుడికి సంబంధించిన అదృశ్యం కేసును కూడా ఇదే అధికారి నిబంధనలకు విరుద్ధంగా మూసివేసినట్లు అధికారులు గుర్తించారు.
దీంతో పోలీసుల దర్యాప్తు విధానంపై తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి.
వివరాలు
పోలీసు వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావాలి: లీ జే-మ్యుంగ్
కేసులను సక్రమంగా విచారించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో జెజు సియోబు పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురు ఉన్నతాధికారులను నేషనల్ పోలీస్ ఏజెన్సీ (ఎన్‌పీఏ)సెలవుపై పంపింది.
మరోవైపు ఈ వరుస మరణాల వెనుక హత్యలు లేదా అక్రమ రవాణా ఉన్నాయా అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే ఇప్పటివరకు ఈ అనుమానాలను నిర్ధారించే ఆధారాలు లభించలేదు. ఈ ఘటనలపై అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ప్రత్యేకంగా స్పందించారు.
అదృశ్యం కేసుల దర్యాప్తులో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు.
పోలీసు వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని కూడా సూచించారు.
ప్రజల భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు తలెత్తకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.