Pakistan new PM: పాకిస్థాన్ కొత్త ప్రధానిగా నవాజ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్
పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని ఎంపిక విషయంలో పీఎంఎల్ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నవాజ్ షరీఫ్ తన తమ్ముడు షెహబాజ్ షరీఫ్‌ను పాకిస్థాన్ కొత్త ప్రధానిగా, కుమార్తె మరియం నవాజ్‌ను పంజాబ్ సీఎం పదవికి నామినేట్ చేశారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి మర్యం ఔరంగజేబ్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో పీఎంఎల్‌ఎన్‌కు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు నవాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారని, పాకిస్థాన్‌ను సంక్షోభం నుంచి బయటపడేయడంలో కొత్త ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఔరంగజేబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నవాజ్ షరీఫ్ మూడుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా పని చేశారు. షాబాజ్ షరీఫ్ రెండోసారి పాకిస్థాన్ ప్రధాని కానున్నారు.
జర్దారీని రాష్ట్రపతి చేయాలి: బిలావల్
కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఔరంగజేబ్ మాట్లాడుతూ.. అధికారాన్ని పంచుకునేందుకు ప్రతి రాజకీయ పార్టీలోనూ కమిటీలు వేస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ప్రధానమంత్రి పదవి పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) ప్రకటించిన ప్రధానమంత్రి అభ్యర్థికి మద్దతు ఇస్తుందని చెప్పారు. తమ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని, అందుకే ప్రధానమంత్రి పదవిని ఆశించడం లేదని పేర్కొన్నారు. తన తండ్రి జర్దారీని తదుపరి రాష్ట్రపతి కావాలని ఆశపడుతున్నట్లు వివరించారు. తన నాన్న కాబట్టి రాష్ట్రపతి పదవిని ఆయనకు ఇవ్వాలని అనడడం లేదన్నారు. తీవ్రసంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెంకించే వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఆసిఫ్ అలీ జర్దారీని బిలావల్ అభిప్రాయపడ్డారు.