Nepal Floods: వరద వస్తుందని తెలిసి.. 900 మంది విద్యార్థులను స్కూల్ నుండి పంపించేసి హెడ్‌మాస్టర్
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. అయితే ఓ హెడ్‌మాస్టర్ అప్రమత్తత,సమయస్ఫూర్తి కారణంగా దాదాపు 900 మంది విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. వరద ముంచెత్తడానికి కేవలం 10 నిమిషాల ముందు విద్యార్థులను పాఠశాల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయం గురించి హెడ్‌మాస్టర్ రాజేంద్ర దవాడీ బీబీసీకి వివరించారు. నువాకోట్‌లోని త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్‌కు రాజేంద్ర దవాడీ హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:10 గంటలకు విపత్తు గురించి హెచ్చరిస్తూ తనకు నాలుగు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ఈ భారీ వరదల కారణంగా ఇప్పటివరకు 794 మంది మరణించగా.. మరో 2,500 మంది ఆచూకీ తెలియకుండా పోయారు.
వివరాలు
నాలుగు హెచ్చరికలు.. వెంటనే నిర్ణయం
వరదకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే దవాడీ పాఠశాలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు.
విద్యార్థులను ఎత్తైన ప్రాంతాలకు పరుగెత్తాలని సూచించారు. విద్యార్థులతో నిండిన బస్సులను కూడా వెనక్కి తిప్పి ప్రమాద ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
''ఆ సమయంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోయినా.. కనీసం మరో 10 నిమిషాలు ఆలస్యం చేసినా విద్యార్థులతో సహా మేమెవరూ ఈరోజు మీతో మాట్లాడటానికి బతికి ఉండేవాళ్లం కాదు'' అని దవాడీ తెలిపారు.
కొద్ది నిమిషాల వ్యవధిలో నలుగురు వ్యక్తుల నుంచి వచ్చిన హెచ్చరికలు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారబోతోందో అంచనా వేయడానికి ఆయనకు ఉపయోగపడ్డాయి.
ఓ విద్యార్థి తల్లి చెప్పిన మాటలు కూడా తన నిర్ణయాన్ని మరింత బలపరిచాయని దవాడీ గుర్తుచేసుకున్నారు.
వివరాలు
నాలుగు హెచ్చరికలు.. వెంటనే నిర్ణయం
''ఒక విద్యార్థి తల్లి పరుగెత్తుకుంటూ వచ్చి..'పెద్ద వరద వస్తోంది. నా కూతురిని తీసుకెళ్లడానికి వచ్చాను' అని చెప్పింది'' అని ఆయన తెలిపారు.
''తల్లిదండ్రులు బలమైన కారణం లేకుండా అంతగా ఆందోళన చెందరు. అందుకే విద్యార్థులను వెంటనే ఖాళీ చేయించాలి అనుకున్నాను. ఒకవేళ వరద రాకపోయినా పిల్లలు ఒకరోజు తరగతులు కోల్పోతారు. అంతకంటే పెద్ద నష్టం ఏమీ ఉండదు కదా అనుకున్నాను'' అని దవాడీ చెప్పారు.
విద్యార్థుల ప్రాణాలను కాపాడగలిగినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.
వివరాలు
స్కూల్ భవనం బురదలో..
విద్యార్థులను బయటకు పంపిన కొద్దిసేపటికే పరిస్థితి ఎంత భయంకరంగా మారిందో స్పష్టమైంది.
త్రిభువన్ త్రిశూలి స్కూల్ భవనం బురద,శిథిలాల కింద పూర్తిగా కూరుకుపోయింది.
నదికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న హాస్టల్‌ను కూడా వేగంగా వచ్చిన వరద నీరు క్షణాల్లో ముంచేసిందని దవాడీ తెలిపారు.
అయితే మొదట్లో చాలామంది విద్యార్థులకు ప్రమాద తీవ్రత అర్థం కాలేదు.
16ఏళ్ల విద్యార్థిని యునిషా అమాత్య తన స్నేహితులతో కలిసి సురక్షిత ప్రాంతానికి చేరుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
వివరాలు
స్కూల్ భవనం బురదలో..
''మేము కేవలం 10 సెకన్ల తేడాతో ప్రాణాలతో బయటపడ్డాం'' అని ఆమె బీబీసీకి తెలిపారు.
వరద రాకముందు తామంతా తరగతుల్లో చదువుకుంటున్నామని యునిషా చెప్పారు.
ఉపాధ్యాయులు ఒకే చోట గుమిగూడినా.. మొదట ఏం జరుగుతుందో వారికి కూడా పూర్తిగా అర్థం కాలేదన్నారు.
''దాదాపు ఐదు నిమిషాల తర్వాత టీచర్లు వచ్చి వరద గురించి చెప్పారు. వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు'' అని ఆమె తెలిపారు.
వివరాలు
ప్రమాదాన్ని కొందరు తక్కువగా అంచనా వేశారు
వరద వార్త విన్న తర్వాత ఓ విద్యార్థి స్పృహ తప్పి పడిపోయాడని యునిషా చెప్పారు.
అయినప్పటికీ చాలామంది మొదట పరిస్థితిని అంత తీవ్రంగా తీసుకోలేదు.
మ్యాథ్స్ తరగతిలో ఉన్న తమ సహచరుల కోసం కొందరు విద్యార్థులు ఎదురుచూశారని ఆమె తెలిపారు.
యునిషా,ఆమె స్నేహితులు పాఠశాల వెనుక ఉన్న చిన్న దారి గుండా కొండపైకి పరుగులు తీశారు.
''నేను వేగంగా నడవలేకపోయాను. పైకి ఎక్కడానికి నా స్నేహితులు సాయం చేశారు. సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి ప్రయత్నించాం. స్కూల్ వెనుక ఉన్న ఇరుకైన నిచ్చెన మార్గం ద్వారా బయటపడ్డాం. నా కళ్ల ముందే త్రిశూలి బజార్ మార్కెట్ వరదలో కొట్టుకుపోయింది'' అని ఆమె తెలిపారు.
వివరాలు
ప్రమాదాన్ని కొందరు తక్కువగా అంచనా వేశారు
తప్పించుకునే సమయంలో ఎదురైన ప్రమాదాన్ని కూడా యునిషా వివరించారు.
''నా షూస్‌కు గ్రిప్ లేకపోయి ఉంటే కింద పడిపోయేదాన్ని.బయటపడేందుకు విద్యార్థులు,ఇతర ప్రజలు ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. మరో మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు ప్రజలు వరదలో కొట్టుకుపోయినట్లు తెలిసింది'' అని ఆమె చెప్పారు.
వివరాలు
కొండపైకి చేరిన విద్యార్థులు
విద్యార్థులు, ఉపాధ్యాయులు తొలుత కొండపైకి కొన్ని వందల మీటర్ల దూరం వెళ్లారు. అక్కడి నుంచి సమీపంలోని మరో గ్రామానికి చేరుకున్నారు.
అయితే వరదల కారణంగా రహదారులు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.
దీంతో రెస్క్యూ బృందాలు వచ్చే వరకు చాలామంది రెండు రాత్రులు అక్కడే చిక్కుకుపోయారు.
నదికి అవతలి వైపు నివసించే హెడ్‌మాస్టర్ దవాడీ, విద్యార్థిని యునిషాను చివరకు హెలికాప్టర్‌లో వారి గ్రామానికి తరలించారు.
వివరాలు
కూతురు కనిపించక తల్లిదండ్రుల ఆందోళన
మరోవైపు తమ పిల్లల పరిస్థితి ఏమైందో తెలియక తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
యునిషా తల్లి సబినా కుమారి శ్రేష్ఠ తన కూతురికి, భర్తకు పదేపదే ఫోన్ చేసినా ఇద్దరి ఫోన్లు అందుబాటులోకి రాలేదని చెప్పారు.
ఆమె భర్త యువరాజ్ అమాత్య విషయం తెలియగానే పాఠశాల వైపు పరుగులు తీశారు.
''వరద గురించి తెలియగానే నా కూతురికి ఫోన్ చేశాను. కానీ కాల్ కలవలేదు. దాంతో చాలా భయపడ్డాను'' అని ఆయన చెప్పారు.
వివరాలు
కూతురు కనిపించక తల్లిదండ్రుల ఆందోళన
''కొన్ని నిమిషాల్లోనే నా కూతురు చదివే స్కూల్ వైపు వెళ్లాను.అప్పటికే త్రిశూలి బజార్ మొత్తం వరదలో కొట్టుకుపోయింది. నా కూతురు ఇక లేదేమో అనుకున్నాను. అక్కడే స్కూటర్ ఆపేశాను. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ నా కూతురిని చూడకుండా తిరిగి వెళ్లలేకపోయాను'' అని యువరాజ్ వివరించారు.
దాదాపు గంటపాటు కూతురు బతికుందో లేదో తెలియక ఆయన వరుసగా ఫోన్ చేస్తూనే ఉన్నారు.
వివరాలు
చివరకు కూతురూ ఫోన్ ఎత్తడంతో..
''చివరికి నా కూతురు ఫోన్ ఎత్తింది. ఆ క్షణంలో నేను ఏడుపు ఆపుకోలేకపోయాను. నాతో ఉన్న ఇద్దరు బంధువులు కూడా ఏడుస్తూ నన్ను కౌగిలించుకున్నారు'' అని యువరాజ్ తెలిపారు.
ఆ సంఘటనను గుర్తుచేసుకున్న యునిషా కూడా భావోద్వేగానికి గురయ్యారు.
''మా నాన్న నుంచి కాల్ వచ్చింది. ఆయన ఏడుస్తున్నారు. ఆ సమయంలో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను'' అని ఆమె చెప్పారు.
వివరాలు
ఇంటికి చేరే వరకు కుటుంబం ఆందోళన
యునిషా కుటుంబ సభ్యులు ఆమె కోసం ఇంటి వద్ద ఆత్రుతగా ఎదురుచూశారు.
''నా చిన్న కూతురు కూడా నిద్రపోలేదు. మూడు రోజుల తర్వాత శుక్రవారం ఆమెను చూడగలిగినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాను'' అని యునిషా తల్లి చెప్పారు.
అయితే ఈ ఘటన తర్వాత యునిషా తన భవిష్యత్తు చదువుల గురించి ఆలోచిస్తున్నారు.
''ఇప్పుడు నా పైచదువుల గురించి ఆందోళనగా ఉంది. నేను మరో స్కూల్‌కు మారాల్సి వస్తే పాత స్నేహితులను కోల్పోతాను. కొత్తవారితో పరిచయం ఏర్పరచుకోవడం కష్టంగా ఉంటుంది'' అని ఆమె అన్నారు.
వివరాలు
ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అవసరం
ఇలాంటి విపత్తుల సమయంలో ప్రజలను మరింత వేగంగా అప్రమత్తం చేసేందుకు సైరన్లు, ఎవాక్యుయేషన్ అలర్ట్‌లతో కూడిన మెరుగైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అవసరమని హెడ్‌మాస్టర్ దవాడీ అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ, ప్రమాద తీవ్రతను గుర్తించిన వెంటనే తాను తీసుకున్న నిర్ణయం పెద్ద విషాదాన్ని నివారించిందని ఆయన భావిస్తున్నారు.
''ఆ పీరియడ్ పూర్తయ్యే వరకు ఆగాలని నేను నిర్ణయించుకుని ఉంటే.. అక్కడ ఏమీ మిగిలి ఉండేది కాదు'' అని దవాడీ అన్నారు.