Loading...
Nepal Floods: నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. వైరల్‌గా మారిన 'లక్కీ హౌస్‌' కథ ఇదే
నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. వైరల్‌గా మారిన 'లక్కీ హౌస్‌' కథ ఇదే

Nepal Floods: నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. వైరల్‌గా మారిన 'లక్కీ హౌస్‌' కథ ఇదే

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాలయ ప్రాంతంలో హిమానీనదం సమీపంలోని కొండచరియలు భారీగా విరిగిపడటంతో నేపాల్‌లో ఒక్కసారిగా జలప్రళయం సంభవించింది. కొండల నుంచి భారీగా రాళ్లు దొర్లడంతోపాటు కరిగిన మంచు నీరు దిగువ ప్రాంతాల్లోని నదుల్లోకి చేరింది. దీంతో నదుల్లో వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ప్రభావంతో నేపాల్‌,టిబెట్‌ ప్రాంతాల్లో అనేక భవనాలు, వంతెనలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు హిమాలయ లోయల్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. భారీగా ప్రవహించిన నీటితోపాటు బురద, బండరాళ్లు, చెట్ల దుంగలు దిగువ ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 900 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు దాదాపు 3 వేల మందికిపైగా ఆచూకీ ఇంకా తెలియరాలేదు. బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

'లక్కీ హౌస్‌'

ఈ విపత్తుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చుట్టుపక్కల ఇళ్లు, నిర్మాణాలు వరద ధాటికి నేలమట్టమైనప్పటికీ.. ఓ ఆకుపచ్చ రంగు ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది.

అంతేకాదు.. అందులో నివసిస్తున్న కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా బయటపడ్డారు.

దీంతో ఈ ఇంటిని నెటిజన్లు 'లక్కీ హౌస్‌'గా పేర్కొంటూ ఆసక్తికరంగా చర్చిస్తున్నారు.

వివరాలు 

ఇల్లు చుట్టూ వరద నీరు.. అయినా కూలలేదు

ఆగస్టు 26న నేపాల్‌లో వచ్చిన ఆకస్మిక వరదల సమయంలో నీరు, బురద, భారీ బండరాళ్లు, చెట్ల దుంగలు ఇళ్లు, వంతెనలు, రహదారులను తీవ్రంగా ధ్వంసం చేశాయి.

అయితే అదే విధ్వంసం మధ్య ఈ ఆకుపచ్చ ఇల్లు మాత్రం నిలకడగా కనిపించింది.

వరద నీరు దాదాపుగా ఇంటిని చుట్టుముట్టినా దాని నిర్మాణం కూలిపోలేదు.

వరద ఉద్ధృతి పెరగడంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు బాల్కనీలోకి చేరారు.

ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో గడిపారు. అయితే ఆ ఇంటి నిర్మాణం బలంగా ఉండటంతో వరద ఉద్ధృతిని తట్టుకుని నిలబడింది. దీంతో అందులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడగలిగారు.

ADVERTISEMENT

వివరాలు 

RCC ఫ్రేమే ఇంటిని కాపాడిందా?

ఈ ఇల్లు ఇంతటి భారీ విపత్తును తట్టుకుని ఎలా నిలిచిందనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

నిర్మాణ నిపుణుల విశ్లేషణ ప్రకారం..ఇంటిలో రీన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ (RCC) ఫ్రేమ్‌ ఉండటం కీలకంగా మారి ఉండొచ్చు.

స్టీల్ రాడ్లతో అనుసంధానించిన పిల్లర్లు, బీములు, బలమైన పునాది ఇంటి నిర్మాణానికి అదనపు స్థిరత్వాన్ని అందించినట్లు నిపుణులు చెబుతున్నారు.

వరద నీరు,బురద, బండరాళ్లు ఇంటిని ఢీకొన్న సమయంలో భారీ ఒత్తిడి ఏర్పడుతుంది.

అయితే బలమైన RCC నిర్మాణం ఆ ఒత్తిడిని కొంతవరకు తట్టుకోగలిగింది. అందువల్ల ఇల్లు పూర్తిగా కూలిపోకుండా నిలిచినట్లు విశ్లేషిస్తున్నారు.

అయితే కేవలం నిర్మాణ పద్ధతి వల్లే ఇల్లు బయటపడిందని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంటి స్థానం కూడా చాలా కీలకమైన అంశమని చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇంటి స్థానం కూడా కలిసొచ్చిందా?

ఈ ఇల్లు ప్రధాన వరద ప్రవాహ మార్గానికి కొంత దూరంగా, కాస్త ఎత్తైన ప్రదేశంలో ఉండటం కలిసొచ్చినట్లు నిపుణుల అంచనా.

అంతేకాదు.. ఇంటి కాంపాక్ట్‌ ఆకారం కూడా వరద ప్రభావాన్ని తగ్గించి ఉండొచ్చని చెబుతున్నారు.

వరద ప్రవాహం ఇంటిని ఢీకొన్నప్పుడు మొత్తం నీరు ఒకే దిశలో ఇంటిపైకి దూసుకురాకుండా ఇరువైపులా విడిపోయి ప్రవహించినట్లు కనిపిస్తోంది.

అదే సమయంలో పక్కనే ఉన్న కొన్ని ఇళ్లను వరద నీటితోపాటు బండరాళ్లు, మట్టి పెళ్లలు నేరుగా ఢీకొన్నాయి.

కానీ ఈ ఆకుపచ్చ ఇల్లు ప్రధాన ప్రవాహానికి కొద్దిగా పక్కకు, ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో వరద శక్తిలో కొంత భాగం ఇంటిని నేరుగా తాకకుండా పక్కలకు మళ్లిపోయింది.

వివరాలు 

అనేక అంశాలు కలిసి రక్షించాయి

ఈ 'లక్కీ హౌస్‌' వరదలకు తట్టుకుని నిలబడటానికి ఒకే ఒక్క కారణం లేదని నిపుణులు చెబుతున్నారు.

వరద వేగం, నీటి పరిమాణం, బండరాళ్ల ప్రభావం, పునాది బలం, నిర్మాణ నాణ్యత, ఇంటి నిర్మాణ విధానం, అది ఉన్న ప్రదేశం.. ఇలా అనేక అంశాలు కలిసి పనిచేసినట్లు విశ్లేషిస్తున్నారు.

అయితే ఇలాంటి RCC నిర్మాణం ఉన్న ప్రతి ఇల్లు భారీ వరదలను తట్టుకుంటుందని భావించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వరద తీవ్రత, భౌగోళిక పరిస్థితులు, నిర్మాణ నాణ్యత, ఇంటి పునాది, నీటి ప్రవాహ దిశ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

వివరాలు 

'ఆ ఇంజినీర్‌ ఎవరు?'.. నెటిజన్ల సరదా ప్రశ్నలు

ఈ ఇల్లు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.

'ఈ ఇంటిని ఇంత బలంగా నిర్మించిన ఇంజినీర్‌ ఎవరు?', 'ఏ సిమెంట్‌ వాడారు?' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదే సమయంలో బిహార్‌లో చిన్నపాటి వరదలకే కొన్ని వంతెనలు దెబ్బతినడం, ఇటీవల వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వేలు సైతం వరదల ప్రభావానికి గురవుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.

'ఆ ఇంజినీర్‌ సాబ్‌ను ఇక్కడికి రప్పించాలి' అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేపాల్‌ వరదల్లో ఒక్క ఇల్లు మాత్రం సేఫ్‌.. దాని నిర్మాణ రహస్యం ఇదే

ADVERTISEMENT