LOADING...
Netanyahu: అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడి చేస్తాం: నెతన్యాహు
అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడి చేస్తాం: నెతన్యాహు

Netanyahu: అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడి చేస్తాం: నెతన్యాహు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా ఇరాన్‌తో చర్చలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ అణు కార్యక్రమంపై తమ దేశం కఠిన వైఖరినే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు చేపట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అవసరం వస్తే మూడోసారి కూడా దాడులు నిర్వహించే సామర్థ్యం తమ సైన్యానికి ఉందని తెలిపారు. గతంలో ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యలు సముచితమేనని ఆయన సమర్థించుకున్నారు. ఇరాన్‌ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని,ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా అమెరికాను ఉద్దేశించినవిగా భావిస్తున్నారు.

వివరాలు 

దేశ భద్రతకు ముప్పు కలిగించే ఏ చర్యనైనా అడ్డుకుంటాం: నెతన్యాహు

ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, టెహ్రాన్‌ అందుకు అంగీకరించకపోతే మళ్లీ సైనిక చర్యలు చేపట్టాల్సి వస్తుందని నెతన్యాహు హెచ్చరించారు. తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే ఏ చర్యనైనా అడ్డుకుంటామని పునరుద్ఘాటించారు. ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమానికి అవకాశం కల్పించే ఎలాంటి ఒప్పందాన్నీ ఇజ్రాయెల్‌ ఎప్పటికీ అంగీకరించదని స్పష్టం చేశారు.

వివరాలు 

దక్షిణ లెబనాన్‌లో నెతన్యాహు పర్యటన

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు నిలిపివేయకపోతే ఎలాంటి ఒప్పందానికి ముందుకు రామని ఇరాన్‌ స్పష్టం చేస్తోంది. అయితే, తుది ఒప్పందం కుదిరే వరకు ఇజ్రాయెల్‌ బలగాలు బీరుట్‌లోనే కొనసాగుతాయని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ నియంత్రణలో ఉన్న ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఇరాన్‌ నుంచి అణు ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు దక్షిణ లెబనాన్‌ను విడిచిపెట్టవద్దని అక్కడి సైనిక దళాలకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement