USA-Iran: ఇరాన్‌పై ఇప్పట్లో దాడులు లేవు.. మిత్రదేశాలకు అమెరికా కీలక సమాచారం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు ప్రస్తుతానికి నిలిచిపోయాయి. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగలేదు. యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై తక్షణమే కొత్త దాడులు చేపట్టే ఉద్దేశం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈవిషయాన్ని తమ మిత్రదేశాలకు తెలియజేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి ఇరాన్‌పై కొత్తగా దాడులు ఉండబోవని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఇరాన్ వైపు నుంచి మళ్లీ దాడులు మొదలైతే మాత్రం అమెరికా సైనిక చర్యకు దిగే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని అధికారులు స్పష్టం చేశారు. అంటే ప్రస్తుతానికి దాడులకు విరామం ఇచ్చినప్పటికీ..పరిస్థితులు మారితే సైనిక చర్యకు సిద్ధంగా ఉన్నామని అమెరికా సంకేతాలు ఇచ్చినట్లైంది.
వివరాలు
హర్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధనం
మరోవైపు ఇరాన్‌పై ఒత్తిడిని మాత్రం అమెరికా తగ్గించడం లేదు. ఇరాన్ ఓడరేవుల నుంచి నౌకల రాకపోకలను నియంత్రించేలా హర్మూజ్ జలసంధిలో దిగ్బంధాన్ని కొనసాగిస్తోంది.
అదే సమయంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచేందుకు కొత్త ఆంక్షలను ప్రకటించింది.
సోమవారం 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్' పేరుతో 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది.
ఇరాన్ సైనిక కార్యకలాపాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్ వాణిజ్యంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది.
వివరాలు
ఇరాన్ ఆర్థిక,వాణిజ్య,సముద్ర మార్గాలపై ఒత్తిడి
ఇరాన్‌కు ప్రపంచంతో ఉన్న ఆర్థిక సంబంధాలను దెబ్బతీయడమే తాజా ఆంక్షల ప్రధాన ఉద్దేశమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ గతంలోనే స్పష్టం చేశారు.
ఇరాన్‌కు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ద్వారా అందుతున్న ఆదాయ మార్గాలను కట్టడి చేయడంతో పాటు.. ఆ దేశ సైనిక కార్యకలాపాలకు అవసరమైన ఆర్థిక వనరులను తగ్గించడమే లక్ష్యంగా అమెరికా చర్యలు కొనసాగుతున్నాయి.
అందువల్ల ఒకవైపు ఇరాన్‌పై తక్షణ దాడులు ఉండవని అమెరికా చెబుతున్నప్పటికీ.. మరోవైపు ఆర్థిక, వాణిజ్య, సముద్ర మార్గాలపై ఒత్తిడిని మాత్రం కొనసాగిస్తోంది.
దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా ముగియలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
పరిస్థితులు మళ్లీ తీవ్రరూపం దాల్చితే అమెరికా తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.