LOADING...
One year of Trump 2.0: ట్రంప్‌ 2.0కి ఏడాది: టారిఫ్‌ల నుంచి వలస విధానాల వరకూ-ఎలా మారాయి?
ట్రంప్‌ 2.0కి ఏడాది: టారిఫ్‌ల నుంచి వలస విధానాల వరకూ-ఎలా మారాయి?

One year of Trump 2.0: ట్రంప్‌ 2.0కి ఏడాది: టారిఫ్‌ల నుంచి వలస విధానాల వరకూ-ఎలా మారాయి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 ప్రారంభంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ వైట్‌హౌస్‌కి చేరుకున్నప్పుడు, భారత్‌లో చాలామంది ఆనందం వ్యక్తం చేశారు. ఇది ట్రంప్‌ 1.0కు కొనసాగింపే అవుతుందన్న ఆశలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి 'మంచి మిత్రుడు'గా పేరున్న ట్రంప్‌ అధికారంలోకి రావడంతో భారత్-అమెరికా సంబంధాలు మరింత సులభంగా ముందుకెళ్తాయని భావించారు. కానీ రాజకీయాలు ఊహించలేనివి. ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత దశాబ్దంగా రక్షణ, వాణిజ్యం వంటి రంగాల్లో అమెరికాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న భారత్‌, ట్రంప్‌ నిర్ణయాలతో వరుస అడ్డంకులను ఎదుర్కొంది.

వివరాలు 

భారత్-అమెరికా బంధాల్లో అనూహ్య మలుపు

న్యూఢిల్లీకి అమెరికా ఇక భాగస్వామి కాదు, మిత్రుడు కాదు, శత్రువులా వ్యవహరిస్తోందన్న భావన ఏర్పడింది. ట్రంప్‌ 2.0 తొలి ఏడాదిలో భారత్-అమెరికా సంబంధాలు ఎలాంటి మలుపులు తిరిగాయో జనవరి 20 నాటికి ఒకసారి పరిశీలిద్దాం. గత ఏడాది జనవరిలో ట్రంప్‌ పదవిలోకి రాగానే భారత విధాన నిర్ణయకర్తల్లో ఉత్సాహం కనిపించింది. మొదట్లో సంకేతాలూ సానుకూలంగానే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్వాడ్‌ దేశాల (భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికా) విదేశాంగ మంత్రుల సమావేశాన్ని వాషింగ్టన్‌లో నిర్వహించారు. చట్టపాలన, ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమత్వం రక్షణతో పాటు ఇండో-పసిఫిక్‌లో సముద్ర, ఆర్థిక, సాంకేతిక భద్రతలను బలోపేతం చేయాలని కట్టుబాటును పునరుద్ఘాటించారు.

వివరాలు 

భారత్-అమెరికా బంధాల్లో అనూహ్య మలుపు

ఫిబ్రవరిలో ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇచ్చారు. ట్రంప్‌ను కలిసిన తొలి విదేశీ నేతల్లో మోదీ ఒకరు. ఆ భేటీలో రక్షణ, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలను ప్రకటిస్తూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరోసారి ధృవీకరించారు. ఉమ్మడి ప్రకటనలో ఈ బంధం 'పరస్పర నమ్మకం, పంచుకున్న ప్రయోజనాలు, సత్సంకల్పం'పై ఆధారపడిందని పేర్కొన్నారు. కానీ ఆ సత్సంకల్పం ఎక్కువ కాలం నిలవలేదు. ఏప్రిల్‌ నాటికి పరిస్థితి క్షీణించింది.

Advertisement

వివరాలు 

భారత్‌పై ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బ

'అమెరికా ఫస్ట్‌' విధానంతో ఏప్రిల్‌లో ట్రంప్‌ దాదాపు అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలపై భారీ టారిఫ్‌లు విధించారు. భారత్‌కు మినహాయింపు ఉంటుందనుకున్నవారికి షాక్‌ ఇస్తూ భారత ఉత్పత్తులపై కూడా దిగుమతి పన్నులు విధించారు. మొదటి దశలోనే 25 శాతం టారిఫ్‌ విధించారు. ఇది ఐస్‌బర్గ్‌కు పైభాగమే. గత ఆగస్టులో రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌ యుద్ధానికి నిధులు అందిస్తున్నారంటూ మరో 25 శాతం టారిఫ్‌ విధించారు. ఈ భారీ టారిఫ్‌లతో చైనా (సుమారు 32%), వియత్నాం (20%), బంగ్లాదేశ్‌ (20%) వంటి దేశాలతో పోలిస్తే భారత్‌ పోటీలో వెనుకబడింది. టారిఫ్‌లతో పాటు ట్రంప్‌ నుంచి, ఆయన సలహాదారుల నుంచి ఘాటు వ్యాఖ్యలూ వచ్చాయి.

Advertisement

వివరాలు 

భారత్‌పై ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బ

జూలై చివర్లో ట్రంప్‌ భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్‌' అని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్టీఫెన్‌ మిల్లర్‌ అమెరికా వస్తువులపై భారత్‌ భారీ టారిఫ్‌లు విధిస్తోందని, ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థను 'మోసం' చేస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి రష్యా చమురు ద్వారా నిధులు సమకూరుస్తోందని విమర్శించారు. ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ కూడా తక్కువ ధరకు రష్యా చమురు కొనుగోలు చేసి లాభపడుతోందంటూ భారత్‌పై విమర్శలు గుప్పించారు.

వివరాలు 

భారత్‌పై ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బ

అయితే టారిఫ్‌లున్నా భారత్‌ కొంత స్థిరత్వం చూపించింది. సెప్టెంబర్‌-డిసెంబర్‌ మధ్య అమెరికాకు ఎగుమతులు కేవలం ఒక శాతం మాత్రమే తగ్గి 25.57 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కానీ రంగాల వారీగా ప్రభావం తీవ్రంగా కనిపించింది. రత్నాలు-ఆభరణాలు (60%), ప్లాస్టిక్‌-లినోలియం (44.3%), గాజు ఉత్పత్తులు (44%), ఎరువులు (33.3%) వంటి శ్రమాధారిత రంగాల్లో భారీ పతనం నమోదైంది. చిన్న ఎగుమతిదారులకు టారిఫ్‌ల దెబ్బ తగిలినట్టు స్పష్టమైంది.

వివరాలు 

పాకిస్థాన్‌ వైపు ట్రంప్‌ అడుగులు

గత మేలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన 'ఆపరేషన్‌ సిందూర్‌' అనంతరం ట్రంప్‌-మోదీ సంబంధాల్లో మార్పు మరింత స్పష్టంగా కనిపించింది. ఐదు రోజుల పోరాటం తర్వాత కాల్పుల విరమణ ప్రకటించగానే, తానే మధ్యవర్తిగా శాంతి తీసుకొచ్చానని ట్రంప్‌ ప్రకటించారు. టారిఫ్‌ల బెదిరింపులతో రెండు దేశాలను ఆపానని చెప్పుకొచ్చారు. భారత్‌ ఈ వాదనను ఖండించడంతో పాటు మధ్యవర్తిత్వ ప్రతిపాదనను కూడా తిరస్కరించింది. ఈ ఘటనతో ట్రంప్‌ అసంతృప్తికి లోనయ్యారు. అదే సమయంలో పాకిస్థాన్‌-అమెరికా సంబంధాలు మెరుగుపడటం భారత్‌కు ఆందోళన కలిగించింది. ట్రంప్‌కు క్రెడిట్‌ ఇవ్వడంలో ఇస్లామాబాద్‌ ముందుండటంతో, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనను నోబెల్‌ శాంతి బహుమతికి కూడా నామినేట్‌ చేశారు.

వివరాలు 

డిపోర్టేషన్లు, వీసాల కలకలం

వలస విధానాల్లో కూడా భారత్‌-అమెరికా సంబంధాలు క్షీణించాయి. గత ఏడాది జనవరిలోనే ట్రంప్‌ అక్రమ వలసదారుల డిపోర్టేషన్లను వేగవంతం చేసే ఉత్తర్వులకు సంతకం చేశారు. దీనివల్ల భారతీయులు కూడా ప్రభావితమయ్యారు. ఫిబ్రవరిలో 200 మందికిపైగా అక్రమ భారతీయులను చేతికట్టులతో వెనక్కి పంపడం పెద్ద దుమారం రేపింది. నవంబర్‌ 28, 2025 నాటికి మొత్తం 3,250 మంది భారతీయులను డిపోర్ట్‌ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇది గత సంవత్సరాల కంటే చాలా ఎక్కువ. ఇదే కాకుండా హెచ్‌-1బీ వీసాలపై ఒకేసారి లక్ష డాలర్ల ఫీజు విధించడంతో భారతీయులకు భారీ దెబ్బ తగిలింది. లాటరీ విధానాన్ని రద్దు చేసి,ఎక్కువ జీతాలు పొందేవారికి ప్రాధాన్యం ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

వివరాలు 

ట్రంప్‌ విధానాలకు భారత్‌ కౌంటర్‌ మూవ్

హెచ్‌-1బీ వీసాల్లో దాదాపు 74 శాతం భారతీయులే ఉండటంతో, వీసా ఆలస్యం, అనిశ్చితి మరింత పెరిగింది. ట్రంప్‌ చర్యలతో న్యూఢిల్లీ కొత్త మార్గాలు వెతుక్కుంది. ట్రంప్‌ 2.0 తొలి ఏడాదిలో భారత్‌ చైనా, రష్యాల వైపు బహిరంగంగా దగ్గరైంది. ఏడు ఏళ్ల తర్వాత మోదీ చైనాకు వెళ్లి, చైనా, రష్యా నేతలతో చేతులు కలిపారు. దీనితో అమెరికా 'భారత్‌ను కోల్పోయింది' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. డిసెంబర్‌ 2025లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ పర్యటనకు వచ్చి పలు ఒప్పందాలు కుదిరాయి. అదే సమయంలో ట్రంప్‌పై భారత ప్రజాభిప్రాయం కూడా మారింది. ఒకప్పుడు ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న సోషల్‌ మీడియా వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలుగా మారాయని ఫారిన్‌ అఫైర్స్‌ నివేదికలు చెబుతున్నాయి.

వివరాలు 

కొత్త ఏడాది - కొత్త ఆశలు

అయితే ట్రంప్‌ 2.0 రెండో ఏడాదిలోకి అడుగుపెడుతుండగా అన్నీ కోల్పోయినట్టేం కాదు. అమెరికా నుంచి లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ దిగుమతులు పెంచేందుకు భారత్‌ తాజాగా ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే 93 మిలియన్‌ డాలర్ల విలువైన జావెలిన్‌ యాంటీ ట్యాంక్‌ క్షిపణులు,దాదాపు ఒక బిలియన్‌ డాలర్లతో నేవీ హెలికాప్టర్ల నిర్వహణ ఒప్పందాలు జరిగాయి. జనవరి 12న భారత్‌లో కొత్త అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ బాధ్యతలు చేపట్టారు.

వివరాలు 

కొత్త ఏడాది - కొత్త ఆశలు

భారత్‌-అమెరికా బంధం ఈ శతాబ్దంలోని అత్యంత కీలక భాగస్వామ్యమని ఆయన వ్యాఖ్యానించారు. 'నిజమైన మిత్రులు విభేదించినా చివరకు పరిష్కారం కనుగొంటారు' అని తెలిపారు. వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయని కూడా స్పష్టం చేశారు. ట్రంప్‌ రెండో ఏడాది భారత్‌కు అనుకూలంగా మారుతుందన్న అంచనాలు ఉన్నప్పటికీ, రాజకీయాల స్వభావం అనిశ్చితమే. ట్రంప్‌ నిర్ణయాలు అయితే ఎప్పుడూ ఊహకు అందనివే.

Advertisement