
Iran: హిజాబ్‌కు వ్యతిరేంగా పాట.. ఇరాన్‌లో గాయకుడికి 74 కొరడా దెబ్బల శిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లో (Iran)మరోసారి హిజాబ్ అంశం కలకలం రేపుతోంది.హిజాబ్‌కు వ్యతిరేకంగా పాట పాడిన గాయకుడికి 2023లో శిక్ష విధించారు. తాజాగా,ఆయనకు 74 కొరడా దెబ్బలు వేయాలని అక్కడి న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 2022లో ఇరాన్ అంతటా హిజాబ్ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా జరిగాయి.ఈ నేపథ్యంలో నిరసనకారులకు మద్దతుగా గాయకుడు మెహదీ యర్రాహి (Mehdi Yarrahi) ఓ పాట పాడారు. 2023లో ఇరాన్ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు.దోషిగా తేలిన ఆయన గతేడాది విడుదలయ్యారు. తాజాగా,ఈ కేసుపై రివల్యూషనరీ కోర్టు తీర్పు ఇచ్చింది.మెహదీకి 74 కొరడా దెబ్బలు విధించాలని న్యాయమూర్తి ఆదేశించనున్నట్లు గాయకుడి న్యాయవాది తెలిపారు.
వివరాలు
2005లో ప్రారంభమైన 'గస్త్-ఎ-ఇర్షాద్'
తనకు విధించిన శిక్షపై స్పందించిన మెహదీ -"స్వేచ్ఛ కోసం మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా లేని వ్యక్తి, స్వేచ్ఛకు అర్హుడు కాదు" అని పేర్కొన్నారు. కాగా, మెహదీకి విధించిన శిక్షపై ఆయన మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా స్పందించారు. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత, ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి అయ్యింది. అయితే, చాలా మంది మహిళలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. హిజాబ్ నియమాలను అమలు చేయించేందుకు ఇరాన్‌లో నైతిక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 2005లో ప్రారంభమైన ఈ విభాగాన్ని స్థానికంగా 'గస్త్-ఎ-ఇర్షాద్' (Gasht-e-Ershad) గా పిలుస్తారు. ఇస్లామిక్ నైతిక విలువలను గౌరవించడానికి, సరైన దుస్తులు ధరించని వారిపై చర్యలు తీసుకోవడం ఈ విభాగం పనిలో ఒక భాగం.
వివరాలు
నిరసనకారులకు మద్దతుగా అంతర్జాతీయ సమాజం
ఈ నేపథ్యంలో, 2022లో ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు తీవ్ర స్థాయికి చేరాయి. మాసా అమీని (Mahsa Amini) అనే యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న కారణంతో నైతిక పోలీసుల చేతిలో అరెస్టయ్యారు. కస్టడీలో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఆగ్రహించిన వేలాది మంది మహిళలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. అంతర్జాతీయ సమాజం కూడా నిరసనకారులకు మద్దతుగా నిలిచి, టెహ్రాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం తీవ్రంగా ఖండించింది.