LOADING...
Israel-Iran: ఇరాక్ భూభాగంలో ఇజ్రాయెల్ సీక్రెట్ మిలిటరీ బేస్ స్థావరం
ఇరాక్ భూభాగంలో ఇజ్రాయెల్ సీక్రెట్ మిలిటరీ బేస్ స్థావరం

Israel-Iran: ఇరాక్ భూభాగంలో ఇజ్రాయెల్ సీక్రెట్ మిలిటరీ బేస్ స్థావరం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2026
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్, ఇరాన్‌పై దాడులకు ముందుగానే పలు వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరాక్ ఎడారి ప్రాంతంలో రహస్యంగా తాత్కాలిక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ స్థావరాన్ని గుర్తించిన ఇరాక్ భద్రతా బలగాలపై కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. వివరాల ప్రకారం, ఇరాన్‌పై ఫిబ్రవరి 28న అమెరికాతో కలిసి దాడులు ప్రారంభించే కొద్ది రోజుల ముందే ఈ తాత్కాలిక సైనిక కేంద్రాన్ని ఇజ్రాయెల్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఇది ప్రధానంగా ఇజ్రాయెల్ వైమానిక దళానికి లాజిస్టిక్ హబ్‌గా ఉపయోగపడేలా ఏర్పాటు చేశారని సమాచారం. ఈ విషయంపై అమెరికాకు కూడా ముందుగానే అవగాహన ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

వివరాలు

మార్చి తొలి వారంలోనే గుర్తించిన భద్రతా బలగాలు

యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ పైలట్లు ప్రమాదంలో చిక్కుకుంటే వారిని వెంటనే రక్షించేందుకు ప్రత్యేక దళాలను కూడా ఆ ప్రాంతంలో మోహరించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ రహస్య స్థావరాన్ని మార్చి తొలి వారంలోనే ఇరాక్ భద్రతా దళాలు గుర్తించినట్లు సమాచారం. అనంతరం చెక్‌పోస్టును రక్షించే క్రమంలో ఇరాకీ బలగాలపై ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఓ ఇరాకీ సైనికుడు మరణించినట్లు కథనాలు చెబుతున్నాయి. ఇక ఈ ఘటనపై ఇరాకీ దళాలు లోతుగా దర్యాప్తు చేయకుండా అడ్డుకోవడంలో బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయెల్ సైన్యం సఫలమైందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఇరాక్‌పై జరిగిన ఈ దాడుల్లో అమెరికాకు ప్రత్యక్ష ప్రమేయం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం.

Advertisement