Brazil Plane Crash: బ్రెజిల్‌లో క్రిస్మస్ వేళ విషాద ఘటన.. ఇళ్లను ఢీకొట్టిన టూరిస్టుల విమానం.. 10 మంది మృతి
బ్రెజిల్‌లో క్రిస్మస్ పండగకు ముందే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. టూరిస్టులతో వెళ్తున్న ఒక చిన్న విమానం కుప్పకూలింది. ఈప్రమాదంలో విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 10మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా,విమానం పడిన ప్రదేశంలో ఉన్న బిల్డింగ్‌లలో మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పర్యాటక నగరమైన గ్రామడోలో జరిగింది. బ్రెజిలియన్ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,విమానం తొలుత ఒక బిల్డింగ్‌ను ఢీకొట్టి,తరువాత కింది అంతస్తులో ఉన్న మొబైల్ ఫోన్ షాప్‌లోకి దూసుకెళ్లింది. ఈఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ అక్కడికక్కడే మరణించారు. గ్రామడో పర్వతప్రాంతం ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉండి,క్రిస్మస్ పండగ సమీపించడంతో టూరిస్టుల రద్దీ ఎక్కువైందని అధికారులు తెలిపారు.