Houthi : హౌతీ తిరుగుబాటుదారుల 18 స్థానాలపై విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌లు పెద్దఎత్తున దాడి చేశాయి. యెమెన్ రాజధాని సనా చుట్టూ ఉన్న 18 హౌతీల స్థావరాలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ సైన్యాలు వైమానిక దాడులు జరిపినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడికి ఆస్ట్రేలియా, బహ్రెయిన్, డెన్మార్క్, కెనడా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ కూడా మద్దతుగా నిలిచాయి. హౌతీ భూగర్భ ఆయుధాల నిల్వ సౌకర్యాలు, క్షిపణి నిల్వ స్థావరాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగానే వెల్లడించింది.
మరిన్ని దాడులు చేస్తాం: రక్షణ మంత్రి
ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలలో ఒకటైన ఎర్ర సముద్రం మార్గాంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి అమెరికా వెనుకాడదని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ అన్నారు. అవసరమైతే మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరిస్తామన్నారు. బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ గ్రాంట్ షాప్స్ మాట్లాడుతూ.. సముద్రం, జలమార్గాలలో ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పాలస్తీనా ప్రజలకు యెమెన్ సహాయం అందించకుండా నిరోధించడానికి అమెరికా, బ్రిటన్ ఈ దాడులు చేసినట్లు హౌతీ రెబల్స్ అన్నారు.