LOADING...
US Attacks: బహ్రెయిన్‌, కువైట్‌లను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్‌ క్షిపణి దాడులు
బహ్రెయిన్‌, కువైట్‌లను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్‌ క్షిపణి దాడులు

US Attacks: బహ్రెయిన్‌, కువైట్‌లను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్‌ క్షిపణి దాడులు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) తర్వాత కొంతకాలంగా ప్రశాంతంగా కనిపించిన పశ్చిమాసియా ప్రాంతం మరోసారి యుద్ధ వాతావరణంలోకి జారుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఇరు పక్షాలు వైమానిక దాడులు, క్షిపణుల ప్రయోగాలు, డ్రోన్‌ దాడులతో ఒకదానిపై ఒకటి విరుచుకుపడ్డాయి. హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు కూడా దాడులకు గురైనట్లు సమాచారం. ఇదే సమయంలో ఇరాన్‌ చమురు విక్రయాలపై అమెరికా మరోసారి ఆంక్షలను అమలు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. భారత స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్ల మేర క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలహీనపడగా, బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.

వివరాలు

రాత్రికి రాత్రే అమెరికా ప్రతిదాడులు..

అంతర్జాతీయ సముద్ర జలాల్లో వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఆ చర్యలను అడ్డుకునేందుకే మంగళవారం రాత్రి ఇరాన్‌పై లక్ష్యిత దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్‌ కేంద్రాలు, పారామిలిటరీ దళాలు వినియోగిస్తున్న 60 చిన్న బోట్లను బాంబులతో ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. మొత్తం 80 లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు అమెరికా తెలిపింది. హర్మూజ్‌ జలసంధిలో సముద్ర రవాణాకు ఆటంకాలు కల్పించేందుకు ఇరాన్‌ ఈ చిన్న బోట్లను వినియోగిస్తున్నట్లు కూడా పేర్కొంది.

వివరాలు

హర్మూజ్‌లో చిక్కుకున్న వేలాది మంది నావికులు..

ప్రస్తుతం హర్మూజ్‌ జలసంధి పరిసర ప్రాంతాల్లో సుమారు 6,000 మంది నావికులు వివిధ నౌకల్లో చిక్కుకుపోయినట్లు అంతర్జాతీయ మారిటైమ్‌ సంస్థ చీఫ్‌ ఆర్సెనియో డొమింగ్వెజ్‌ వెల్లడించారు. మరోవైపు పర్షియన్‌ గల్ఫ్‌లో భారత్‌కు చెందిన తొమ్మిది చమురు ట్యాంకర్లు నిలిచిపోయినట్లు సమాచారం. ఈ నౌకల్లో మొత్తం 198 మంది నావికులు ఉన్నారని తెలుస్తోంది. చిక్కుకున్న నౌకల్లో ఇంధనం, సహజవాయువు (గ్యాస్‌) రవాణా చేస్తున్న ట్యాంకర్లు కూడా ఉన్నట్లు సమాచారం.

Advertisement