'Type 096 submarine':చైనా టాంగ్-క్లాస్ సబ్ సంచలనం… 6,000 మైళ్ల దూరం వరకు దాడి సామర్థ్యం
ఈ వార్తాకథనం ఏంటి
చైనా తన అణు జలాంతర్గామి శక్తిలో కీలకమైన అప్‌గ్రేడ్‌గా టైప్ 096 'టాంగ్-క్లాస్' బాలిస్టిక్ మిసైల్ సబ్‌మరీన్‌ను జనవరి 14న అధికారికంగా ఆవిష్కరించింది. ఈ పరిణామం సముద్రాల అడుగున శక్తి సమతుల్యతలో పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. ఎక్కువ బరువు సామర్థ్యం, అధిక స్టెల్త్ టెక్నాలజీ, దీర్ఘ శ్రేణి క్షిపణులతో ఈ కొత్త సబ్‌మరీన్, చైనా ఇప్పటివరకు అనుసరించిన అణు నిరోధక వ్యూహానికి పూర్తిగా భిన్నంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అణు త్రయం (న్యూక్లియర్ ట్రైయాడ్)లోని సముద్ర విభాగాన్ని అమెరికా, రష్యా ఆధిపత్యంగా నియంత్రించాయి. కానీ నౌకా ఉత్పత్తిలో వేగవంతమైన వృద్ధి, సబ్‌మరీన్ ఇంజినీరింగ్‌లో కీలక పురోగతితో చైనా ఇప్పుడు సముద్రంలోనూ ఆ స్థాయికి చేరువవుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
టైప్ 096 సబ్‌మరీన్ నీటిలో మునిగినప్పుడు 15,000 నుంచి 20,000 టన్నుల వరకు ఉంటుంది
చైనా ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం, టైప్ 096 సబ్‌మరీన్ నీటిలో మునిగినప్పుడు దాని బరువు 15,000 నుంచి 20,000 టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఈ పరిమాణం అమెరికా నేవీకి చెందిన ఓహియో-క్లాస్, త్వరలో రానున్న కొలంబియా-క్లాస్ సబ్‌మరీన్‌ల సరసన దీనిని నిలబెడుతోంది. పరిమాణం పెరగడం ద్వారా రియాక్టర్ సామర్థ్యం, అంతర్గత స్థలం వంటి పాత సమస్యలను చైనా ఇంజినీర్లు అధిగమించినట్టు తెలుస్తోంది. దీని వల్ల శబ్దాన్ని తగ్గించే ఆధునిక సాంకేతికతలను వినియోగించే అవకాశం కలిగింది.
వివరాలు
సబ్‌మరీన్‌లో గరిష్టంగా 24 JL-3 బాలిస్టిక్ క్షిపణులను మోయగల సామర్థ్యం
ఈ సబ్‌మరీన్‌లో రాఫ్ట్-మౌంటెడ్ మెషినరీ, హల్ ఐసోలేషన్ సిస్టమ్‌లు,శబ్దాన్ని అతి తక్కువగా ఉంచే ప్రొపల్షన్ డిజైన్ ఉన్నట్టు సమాచారం. 'ఆర్మీ రికగ్నిషన్' పేర్కొన్న విశ్లేషకుల ప్రకారం, టైప్ 096ను రష్యా బోరై-క్లాస్ సబ్‌మరీన్‌లతో పోలుస్తున్నారు. వైబ్రేషన్, నాయిస్ కంట్రోల్ రంగాల్లో రష్యా సాంకేతిక సహకారం చైనాకు ఉపయోగపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం,ఈ సబ్‌మరీన్‌లో గరిష్టంగా 24 JL-3 బాలిస్టిక్ క్షిపణులను మోయగల సామర్థ్యం ఉంది. ఇవి సుమారు 6,000 మైళ్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలవని సమాచారం. దీంతో చైనా తన స్వదేశ జలాల్లోనే ఉంటూ అమెరికా వంటి దేశాలపై దాడి చేసే సామర్థ్యం సాధించినట్టవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
వివరాలు
ఆవిరి టర్బైన్ వ్యవస్థ ద్వారా ఒకే షాఫ్ట్‌ను నడిపేలా డిజైన్
అంతేకాదు, ఇది మరింత నిశ్శబ్దంగా పనిచేసే విధంగా, ఆధునిక సెన్సర్లు, ఆయుధాలతో సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ సబ్‌మరీన్‌లో ప్రెషరైజ్డ్ వాటర్-కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్ ఉపయోగించారని, ఆవిరి టర్బైన్ వ్యవస్థ ద్వారా ఒకే షాఫ్ట్‌ను నడిపేలా డిజైన్ చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆధునిక పవర్ ప్లాంట్ భాగాలు, మెరుగైన వైబ్రేషన్ డ్యాంపెనింగ్ వల్ల నీటిలో వేగం, స్టెల్త్ పనితీరు మరింత మెరుగుపడినట్టు సమాచారం. నిశ్శబ్దంగా పనిచేసే ప్రొపెల్లర్లు లేదా పంప్-జెట్ ప్రొపల్షన్ వాడటం వల్ల శబ్ద ముద్ర (అకౌస్టిక్ సిగ్నేచర్) గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
ముందు భాగంలో ఆరు 533 మిల్లీమీటర్ల టార్పిడో ట్యూబులు
వివాదాస్పద జలాల్లో ఎవరికి తెలియకుండా పనిచేయడమే లక్ష్యంగా ఈ ఫీచర్లు రూపొందించినట్టు తెలుస్తోంది. అణు క్షిపణులతో పాటు,ముందు భాగంలో ఆరు 533 మిల్లీమీటర్ల టార్పిడో ట్యూబులు ఉండటం వల్ల సాంప్రదాయ దాడి సామర్థ్యమూ పెరిగింది. ఇందులో నుంచి వైర్-గైడెడ్, అధిక వేగంతో దూసుకెళ్లే యు-6 టార్పిడోలను ప్రయోగించవచ్చు. యు-6 టార్పిడోలు 18 మైళ్లకు పైగా పరిధి, గంటకు 60 నాట్స్ వరకు వేగం కలిగి ఉండటంతో,శత్రు సబ్‌మరీన్‌లపై,యుద్ధ నౌకలపై దాడుల్లో ఇది మరింత ప్రభావవంతంగా మారుతోంది. అదనంగా, శబ్దాన్ని మభ్యపెట్టే డికాయ్‌లు,సోనార్ కౌంటర్ మెజర్స్, టోవ్డ్ అరే సోనార్ సిస్టమ్‌లు కూడా ఈ సబ్‌మరీన్‌లో అమర్చినట్టు సమాచారం. ఇవన్నీ కలిసి,ప్రమాదాలను ముందే గుర్తించి తప్పించుకునే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నాయని రక్షణ నిపుణులు అంటున్నారు.