ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బిగ్ షాక్.. సబ్సిడీలో భారీ కోత
ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్ 1నుంచి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఫేమ్ 2 కింద అందిస్తున్న సబ్సిడీని తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు తగ్గించిన సబ్సిడీ జూన్ 1నుంచే అమల్లోకి రానుంది. దీనిపై మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. కీలోవాట్ అవర్ కు సబ్సిడీని రూ.5000 మేర తగ్గించనున్నట్లు ఆ నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. ఎలక్ట్రిక్ వాహనాల రెండో దశ కింద వాహన తయారీదార్లకు కేడబ్ల్యూహెచ్‌కు రూ.15,000 వరకు ప్రభుత్వం సబ్సిడీని అందిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని రూ.10,000 వరకు తగ్గించనున్నారు.
ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిశ్రమలు
వాహనం కొనుగోలు చేయడానికి ఇచ్చే ప్రోత్సాహకాలకు, ప్రస్తుత వాహన వ్యయంలో 40శాతం వరకు పరిమితి ఉంది. దీన్ని వాహనాల ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 15శాతానికి తగ్గించారు. ఈ సవరణలు 2023 జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొనే అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించనుంది. విద్యుత్ వాహనాల తయారీ, విక్రయాలకు ప్రోత్సామివ్వడం కోసం దేశంలో ఈ పథకాన్ని 2019 జూన్ లో ప్రారంభించారు. తాజాగా సబ్సిడీలో కోత పెట్టడంపై విద్యుత్తు వాహన తయారీ పరిశ్రమల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.