భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. కారణమిదే..?
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఫేమ్-2 కింద ఒక్కో ద్విచక్ర వాహనంపై భారీగా సబ్సిడీ ఇస్తోంది. అయితే ఈ పథకం గడువు 2024 మార్చితో ముగియనుంది. దీన్ని పొడిగించాలని వాహనపరిశ్రమ ఇప్పటికే కేంద్రసర్కారును సంప్రదించింది. దీంతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని, పర్యావరణ కాలుష్యం తగ్గించే అవకాశం ఉంటుందని వాహన పరిశ్రమ తన అభిప్రాయాలను స్పష్టంగా కేంద్ర సర్కారుకు విన్నవించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం విక్రయ ధరపై 40శాతం వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అయితే ఈ సబ్సిడీని 15శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని అమోదిస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.
ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీ ద్వారా ప్రయోజనం
ఫేమ్ 2 కింద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సహాకాలను, సబ్సిడీలను అందిస్తోంది. అదే విధంగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల కోసం కేటాయించిన సబ్సిడీ పూర్తిగా వినియోగం కాకపోతే.. మళ్లీ వాటిని ఎలక్ట్రిక్ టూవీలర్ల కోసం నిధులను భర్తీ చేయడానికి ఉపయోగించుకోవచ్చని ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశాడు. ఫేమ్ ఇండియాకు చెందిన ప్రోగ్రామ్ ఫర్ ఇంప్లిమెంటేషన్, సాంక్షనింగ్ కమిటీ ఈ ప్రతిపాదలనపై ఓ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఫేమ్ స్కీమ్ కింద 5.63 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీ ద్వారా ప్రయోజనం చేకూరగా.. 2024లోగా 10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఫేమ్ ఇండియా మద్దతు అందుతుందని ఓ రిపోర్టు వెల్లడించింది.