Lebanon: ఇరాన్,లెబనాన్‌లపై దాడుల్లో 21 మంది మృతి.. బీరుట్‌లో పర్యాటక ప్రాంతంపై బాంబులు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కనిపించడం లేదు. యుద్ధం 13వ రోజుకు చేరుకున్న గురువారం ఇరాన్,లెబనాన్ ప్రాంతాల్లోని పౌర లక్ష్యాలపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దళాలు వైమానిక దాడులు జరిపాయి. ఇరాన్‌లోని భద్రతా చెక్‌పాయింట్లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు నిర్వహించగా, లెబనాన్‌లోని పర్యాటక ప్రాంతాలపైనా బాంబులు వేశారు. ఈ దాడుల్లో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోగా,32 మంది గాయపడ్డారు. ఇక మరోవైపు ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్, లెబనాన్ ప్రతిదాడులు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరిపింది. గల్ఫ్ ప్రాంతంపై మరింతగా దాడులు చేస్తామని, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను కఠినంగా అడ్డుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ హెచ్చరించారు.
వివరాలు
అమెరికా నౌకపై ఆత్మాహుతి దాడి
ఇరాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విడుదల చేసిన తొలి ప్రకటన ఇదే. మార్షల్ ఐలాండ్స్ జెండాతో గల్ఫ్ జలాల్లో ప్రయాణిస్తున్న అమెరికా నౌక "సేఫ్‌సీ విష్ణు"పై ఇరాన్ ఆత్మాహుతి పడవతో దాడి చేసింది. ఈ ఘటన ఇరాక్‌లోని ఖోర్ అల్-జుబైర్ పోర్టు సమీపంలో జరిగింది.ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. మిగిలిన 27 మందిని రక్షించి బస్రాకు తరలించారు. వారిలో 15 మంది భారతీయులు ఉన్నారు. ఇప్పటివరకు ఈ యుద్ధ ఘటనల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, ఒకరు గల్లంతయ్యారు.మరో నలుగురు గాయపడ్డారు. గల్ఫ్ దేశాలపై దాడులు నిలిపివేయాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
వివరాలు
టెహ్రానే లక్ష్యం
యుద్ధం ప్రారంభమైన తొలి ఆరు రోజుల్లోనే ట్రంప్ యంత్రాంగానికి సుమారు 11 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో లక్ష కోట్లకు పైగా) ఖర్చైనట్లు సమాచారం. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రత్యేకంగా దృష్టి సారించాయి. బుధవారం రాత్రి అక్కడి భద్రతా చెక్‌పాయింట్లపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 10 మంది మరణించారు. చెక్‌పాయింట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ దాడి చేయడం ఇదే తొలిసారి. లెబనాన్ రాజధాని బీరుట్‌లో సముద్ర తీర ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక స్థలం రమ్లెట్ అల్-బేదా వద్ద ఒక కారును లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. అక్కడ అనేక నిరాశ్రయులు తలదాచుకుని ఉన్నారని సమాచారం. ఈ ఘటనలో 8 మంది మరణించారు.
వివరాలు
ప్రాణనష్టం
అయితే ఈ ప్రాంతంపై దాడి చేసిన విషయం తమకు తెలియదని ఇజ్రాయెల్ ప్రకటించింది. బీరుట్‌కు దక్షిణంగా ఉన్న అరామౌన్ పట్టణంలో మరో దాడి జరగగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఐరాస శరణార్థ సంస్థ వివరాల ప్రకారం ఇరాన్‌లో దాదాపు 32లక్షల మంది తమ నివాస ప్రాంతాలు వదిలి వలస వెళ్లారు. ఇరాన్‌లో మొత్తం మృతుల సంఖ్య 1,348కి చేరగా,17,000మంది గాయపడ్డారు. ఇందులో 1,100 మంది చిన్నారులు మరణించడం లేదా గాయపడడం జరిగింది. లెబనాన్‌లో ఇప్పటివరకు 634 మంది మరణించగా, 7,59,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవల ఇరాన్‌లోని ఒక అణు కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాక్‌లోని అకషత్ ప్రాంతంలో మిలీషియా స్థావరంపై జరిగిన వైమానిక దాడిలో 14 మంది మృతి చెందారు.
వివరాలు
ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు
లెబనాన్ నుంచి బుధవారం రాత్రంతా ఇజ్రాయెల్‌పై సుమారు 200 రాకెట్లు ప్రయోగించారు. దీంతో ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ప్రజలు రాత్రంతా భయంతో గడిపారు. ఎక్కువ రాకెట్లను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 179 మంది గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్‌లో దుబాయ్ తీరానికి సమీపంలో ఒక కంటెయినర్ నౌకపై ప్రొజెక్టైల్‌తో దాడి జరిగింది. అయితే నౌకలోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు.
వివరాలు
గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత
బహ్రెయిన్‌లోని ముహరాక్ ద్వీపంపై జరిగిన దాడితో భారీ మంటలు చెలరేగాయి. అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. పలు డ్రోన్లు, క్షిపణులు దేశం వైపు దూసుకొచ్చాయి. ఇరాన్ తరఫున గూఢచర్యం చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. కువైట్‌లో ఒక నివాస భవనంపై ఇరాన్ డ్రోన్ కూలడంతో ఇద్దరు గాయపడ్డారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా డ్రోన్ దాడి జరిగింది. ఎవరికీ గాయాలు కాలేదు. డ్రోన్ అవశేషాలు విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్లపై పడటంతో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వివరాలు
దుబాయ్ క్రీక్ హార్బర్‌లోని ఒక టవర్‌లో మంటలు
దుబాయ్‌ను రక్షించడానికి రెండు సార్లు గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసినట్లు యూఏఈ తెలిపింది. డ్రోన్ దాడి కారణంగా దుబాయ్ క్రీక్ హార్బర్‌లోని ఒక టవర్‌లో మంటలు చెలరేగాయి. అల్-బదా ప్రాంతంలో జరిగిన మరో దాడిలో ఒకరు గాయపడ్డారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని దౌత్య కార్యాలయాల ప్రాంతంపై జరిగిన డ్రోన్ దాడిని అడ్డుకున్నామని ఆ దేశం ప్రకటించింది. షైబా చమురు క్షేత్రంపై మరోసారి దాడి చేసేందుకు ఇరాన్ ప్రయత్నించిందని తెలిపింది.
వివరాలు
దాడులు కొనసాగుతాయి: మొజ్తాబా
గల్ఫ్ దేశాలపై దాడులను కొనసాగిస్తామని, హర్మూజ్ జలసంధిలో నౌకల ప్రయాణాన్ని మరింతగా అడ్డుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ స్పష్టం చేశారు. అజ్ఞాతంలో ఉన్న ఆయన విడుదల చేసిన ప్రకటనను ప్రభుత్వ టీవీ యాంకర్ చదివి వినిపించారు. యుద్ధంలో జరిగిన మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు. అమెరికా చేసిన పాఠశాలపై దాడిలో 165 మంది మరణించిన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఇంధన సరఫరాలను అడ్డుకునేలా యుద్ధాన్ని కొనసాగిస్తామని తెలిపారు. తన తండ్రి ఖమేనీపై జరిగిన దాడి సమయంలో తాను అక్కడే ఉన్నానని, ఆయన మృతదేహాన్ని చూశానని మొజ్తాబా చెప్పారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తన భార్యతో పాటు ఒక సోదరి, మరో సోదరి భర్త, మేనకోడలు మరణించినట్లు ధృవీకరించారు.
వివరాలు
యుద్ధం ముగియాలంటే మూడు షరతులు
యుద్ధం ముగియాలంటే ప్రపంచం తమ చట్టబద్ధ హక్కులను గుర్తించాలని, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో దాడులు జరగబోవని భరోసా ఇవ్వాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియాను సందర్శించారు.
వివరాలు
చమురు క్షేత్రాల మూసివేత
ఇరాక్‌లోని బస్రా పోర్టుపై బుధవారం జరిగిన దాడి తర్వాత గురువారం దేశంలోని అన్ని చమురు క్షేత్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలు తాము చైనాకు వెళ్తున్నామని చెప్పి ప్రమాదాన్ని తప్పించుకుంటున్నాయి. ఈ యుద్ధాన్ని అవకాశంగా మార్చుకున్న రష్యా చమురు ఎగుమతుల ద్వారా 7 బిలియన్ డాలర్లు సంపాదించింది. తమ చమురు నౌకపై దాడి చేసినందుకు ఇరాన్ క్షమాపణ చెప్పాలని థాయ్‌లాండ్ డిమాండ్ చేసింది. అయితే హర్మూజ్ జలసంధి గుండా భారత చమురు నౌకలు ప్రయాణించేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వివరాలు
విమాన సర్వీసులు పునఃప్రారంభం
దోహా నుంచి గురువారం ఖతార్ ఎయిర్‌వేస్ 29 విమానాలను నడిపింది. మరోవైపు గల్ఫ్ దేశాల వివిధ నగరాల నుంచి భారత్‌కు 57 విమానాలను షెడ్యూల్ చేసినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. అబుధాబీ, దుబాయ్, ఫజైరా, జెడ్డా, మస్కట్, రస్ అల్ ఖైమా, రియాద్, షార్జా నుంచి ఈ విమానాలు రానున్నాయి. గత నెల 28 నుంచి ఈ నెల 11 వరకు ఆ దేశాల నుంచి 1,50,457 మంది భారత్‌కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలోని రియాద్‌కు గురువారం నుంచి విమాన రాకపోకలను పునరుద్ధరించారు.
వివరాలు
ఇరాన్‌తో భారత్ చర్చలు
దేశ ఇంధన భద్రత అంశంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్‌తో మాట్లాడినట్లు ఆ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జయస్వాల్ తెలిపారు. హర్మూజ్ జలసంధి గుండా భారత్‌కు వచ్చే నౌకల ప్రయాణంపై చర్చలు జరిగాయని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 9వేల మంది భారతీయులు ఉన్నారని,ఘర్షణ ప్రారంభమైన వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. చమురు ధరలు పెరిగితే మాకు లాభమే: ట్రంప్ ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశం అమెరికా. చమురు ధరలు పెరిగితే మాకు ఎక్కువ ఆదాయం వస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ చేతుల్లో అణ్వాయుధాలు ఉండకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. లేకపోతే అది పశ్చిమాసియాతో పాటు ప్రపంచానికి పెద్ద ప్రమాదమని హెచ్చరించారు.
వివరాలు
100 డాలర్లకు చేరిన చమురు ధర
హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అంతరాయం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంది. హర్మూజ్ ప్రాంతంతో పాటు ఇరాక్ సమీపంలో నౌకలపై దాడులు జరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు మొత్తం 19 సరకు రవాణా నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం.