Denza D9 Electric MPV:భారత్‌లోకి BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV.. 730 కి.మీ. రేంజ్, ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
లగ్జరీ కార్ల మార్కెట్‌లోకి మరో కొత్త బ్రాండ్ అడుగుపెట్టింది. చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ BYD అనుబంధ బ్రాండ్ Denza.. భారత్‌లో తన తొలి మోడళ్లుగా D9 ఎలక్ట్రిక్ MPV, Z9 GTలను పరిచయం చేసింది. వీటిలో D9 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీని రూపొందించారు. భారత్‌లో దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.90 లక్షలు. పూర్తిగా తయారైన యూనిట్‌గా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ కారును ఒకే ఒక్క ఫుల్‌లోడెడ్ వేరియంట్‌లో అందిస్తున్నారు. ఇందులోని ఫీచర్లను చూస్తే కదిలే స్టార్ హోటల్‌లా అనిపిస్తుంది. ఈ కారులో 115.07 kWh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ప్యాక్ ఉంది.
వివరాలు
Denza D9లో ప్రధాన ఆకర్షణలు ఇవే
ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 730 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
రూ.10 లక్షల టోకెన్ మొత్తాన్ని చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. Denza D9 ఎలక్ట్రిక్ MPVలో ముందు యాక్సిల్‌పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.
ఇది 462 hp శక్తిని, 365 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 8.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది.
రెండో, మూడో వరుస ప్రయాణికుల సౌకర్యం కోసం పవర్డ్ స్లైడింగ్ డోర్లు ఇచ్చారు. ఒక్క బటన్ నొక్కడం ద్వారా లేదా సెన్సార్ సాయంతో వీటిని తెరవవచ్చు.
వెనుకవైపు మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ టెయిల్‌గేట్ ఉంది.
వివరాలు
బయట డిజైన్ ఎలా ఉందంటే?
ఒకసారి తెరిచిన ఎత్తును గుర్తుంచుకునే సదుపాయం ఇందులో కల్పించారు. యాంటీ పించ్ ఫీచర్ కూడా అందించారు.
Denza D9 ముందు భాగం నిటారుగా, భారీ రూపంతో కనిపిస్తుంది. పెద్ద గ్రిల్‌పై నిలువు క్రోమ్ పట్టీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
U ఆకారపు LED DRLsతో హెడ్‌ల్యాంప్స్‌ను రూపొందించారు. గ్రిల్‌కు ఇరువైపులా సన్నని లైటింగ్ స్ట్రిప్స్ ఉండగా.. బంపర్ దిగువ భాగంలోనూ LED లైటింగ్ ఎలిమెంట్స్ ఇచ్చారు.
సైడ్ ప్రొఫైల్‌లో స్ట్రెయిట్ రూఫ్‌లైన్, బెల్ట్‌లైన్ కనిపిస్తాయి. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చారు.
వెనుక భాగంలో వెడల్పుగా విస్తరించిన LED టెయిల్‌ల్యాంప్ ఆకట్టుకుంటుంది. టెయిల్‌గేట్‌పై Denza పేరును ప్రత్యేకంగా పొందుపరిచారు.
వివరాలు
ఇంటీరియర్‌లో విలాసవంతమైన ఫీచర్లు
ఈ కారు పొడవు 5,250 మి.మీ., వెడల్పు 1,960 మి.మీ., ఎత్తు 1,900 మి.మీ. కాగా.. వీల్‌బేస్ 3,110 మి.మీ. బూట్ స్పేస్ 689 లీటర్లు. కర్బ్ వెయిట్ 2,915 కిలోలు. వేల్ సీ బ్లూ, కాస్మోస్ బ్లాక్, స్టారీ నైట్ గ్రే, ఆర్కిటిక్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
Denza D9లో మొత్తం ఏడు సీట్లు ఉంటాయి. 2+2+3 లేఅవుట్‌లో మూడు వరుసల సీట్లను ఏర్పాటు చేశారు. అన్ని వరుసల్లోనూ నప్పా లెదర్ అప్హోల్స్టరీ ఇచ్చారు.
బ్లాక్ అండ్ బ్రౌన్, బ్లాక్ అండ్ బీజ్, ఆల్ బ్లాక్.. ఇలా మూడు ఇంటీరియర్ రంగుల ఎంపికలు ఉన్నాయి. ముందు సీట్లు 8-వే పవర్ అడ్జస్టబుల్‌గా ఉంటాయి.
వివరాలు
డ్రైవర్ సీటుకు వెంటిలేషన్ సదుపాయం
వీటికి మసాజ్ ఫంక్షన్, 4-వే పవర్ లంబర్ సపోర్ట్ (నడుముకు ఆధారం) అందించారు. డ్రైవర్ సీటుకు వెంటిలేషన్ సదుపాయం ఉంది.
కో-డ్రైవర్ సీటులో బాస్ మోడ్ ఉంటుంది. రెండో వరుస సీట్లలో పవర్ అడ్జస్ట్మెంట్, ఒట్టోమన్, మెమరీ, వెంటిలేషన్ ఫీచర్లు ఉన్నాయి.
మూడో వరుస సీట్లను కూడా 4-వే ఎలక్ట్రిక్ విధానంలో సర్దుకోవచ్చు. డ్యాష్‌బోర్డ్‌పై 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు.
సెంటర్ కన్సోల్‌లో ఫిజికల్ బటన్లు, 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కప్ హోల్డర్లు ఉన్నాయి. రెండో వరుస ప్రయాణికుల కోసం ఆర్మ్‌రెస్ట్‌లో ఫ్రిజ్‌ను అమర్చారు.
వివరాలు
ప్రత్యేక టచ్‌స్క్రీన్లు
సీట్ల మసాజ్, వెంటిలేషన్, రిక్లైన్ వంటి ఫంక్షన్లను నియంత్రించేందుకు ఆర్మ్‌రెస్ట్‌లలో ప్రత్యేక టచ్‌స్క్రీన్లు ఇచ్చారు.
ఇతర ఫీచర్లలో 16 స్పీకర్ల Devialet ఆడియో సిస్టమ్, రెండు సన్‌రూఫ్‌లు, మూడు జోన్ల క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి.
భద్రత కోసం 9 ఎయిర్‌బ్యాగులు, ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, TPMS వంటి ఫీచర్లు అందించారు.
వివరాలు
బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్ వివరాలు
Denza D9లో 115.07 kWh సామర్థ్యం కలిగిన LFP బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 730 కిలోమీటర్ల NEDC రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఇందులో DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీని ద్వారా బ్యాటరీని 10 శాతం నుంచి 97 శాతానికి కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
11 kW AC ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఉంది. సస్పెన్షన్ విషయానికొస్తే.. ముందు భాగంలో మాక్‌ఫెర్సన్ స్ట్రట్స్, వెనుకవైపు మల్టీ లింక్ సస్పెన్షన్ ఏర్పాటు చేశారు.
డ్యూయల్ వాల్వ్ DiSus-C సెమీ యాక్టివ్ డ్యాంపర్లు ఉన్నాయి. రెండు వైపులా వెంటిలేటెడ్ డిస్క్ బ్రేకులు అందించారు.
వివరాలు
ధర, వారంటీ, ప్రత్యర్థి కార్లు
Denza D9కు ఆరు సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వారంటీ అందిస్తున్నారు. బ్యాటరీకి ఎనిమిది సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీ ఉంటుంది.
ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటితో వారంటీ ముగుస్తుంది. హైదరాబాద్‌తోపాటు గురుగావ్, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రత్యేక Denza డీలర్‌షిప్‌ల ద్వారా ఈ కారును విక్రయించనున్నారు.
భారత మార్కెట్‌లో రూ.79.95 లక్షల ధరతో లభించే MG M9కు Denza D9 ప్రత్యర్థిగా నిలవనుంది.
అలాగే Toyota Vellfire, Mercedes-Benz V-Class వంటి ఖరీదైన MPVలకు ప్రత్యామ్నాయంగా ఉండనుంది.
Toyota Vellfire ధర రూ.1.20 కోట్ల నుంచి రూ.1.30 కోట్ల వరకు ఉండగా.. Mercedes-Benz V-Class ధర రూ.1.40 కోట్లుగా ఉంది.