Harley-Davidson: క్రూయిజర్ తరహాలో హార్లీ డేవిడ్‌సన్ స్ప్రింట్ 440
ఈ వార్తాకథనం ఏంటి
తక్కువ సీటు ఎత్తు, ఆకర్షణీయమైన క్రూజర్ డిజైన్‌తో కొత్త బైక్‌ను హార్లీ డేవిడ్‌సన్ పరిచయం చేసింది. '2027 స్ప్రింట్ 440' పేరుతో ఆవిష్కరించిన ఈ మోటార్‌సైకిల్‌ను ఇటలీలో జరుగుతున్న EICMA 2026 ప్రదర్శనలో ప్రదర్శించింది. హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ బైక్‌లో రైడింగ్ సౌకర్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా కొత్తగా బైక్ నడిపేవారు, ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు సౌకర్యాన్ని కోరుకునేవారిని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు. 2027 నుంచి వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలు ప్రారంభించనున్నారు.
Details
440 సీసీ ఇంజిన్‌తో 38 ఎన్ఎం టార్క్
స్ప్రింట్ 440లో 440 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు.
ఇది 6,000 ఆర్‌పీఎం వద్ద 27 హెచ్‌పీ గరిష్ఠ శక్తిని, 4,000 ఆర్‌పీఎం వద్ద 38 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఆరు గేర్ల గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను అందించారు. ముఖ్యంగా ఐదు, ఆరో గేర్లు హైవే ప్రయాణాల్లో ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గించి సౌకర్యవంతమైన రైడింగ్‌కు ఉపయోగపడేలా రూపొందించారు.
లీటరుకు 34 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
Details
671 మిల్లీమీటర్ల సీటు ఎత్తు ప్రత్యేక ఆకర్షణ
ఈ బైక్‌లో అందరి దృష్టిని ఆకర్షించే అంశం 671 మిల్లీమీటర్ల సీటు ఎత్తు. సాధారణంగా ఎత్తైన బైక్‌లపై కూర్చోవడానికి ఇబ్బందిపడేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
బైక్ బరువు 187 కిలోలు. టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్, గుండ్రటి ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, స్టెప్డ్ సీటు క్రూజర్ రూపానికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి.
డార్క్ బిలియర్డ్ గ్రే, వివిడ్ బ్లాక్, టీల్ థండర్ అనే మూడు రంగుల్లో దీన్ని తీసుకురానున్నారు.
Details
TFT డిస్‌ప్లే నుంచి డ్యూయల్ ఛానల్ ABS వరకు
ఫీచర్ల విషయంలోనూ స్ప్రింట్ 440లో ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 3.5 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే, పూర్తి LED లైటింగ్, USB టైప్-C ఛార్జింగ్ పోర్టును అందించారు.
సస్పెన్షన్ కోసం ముందు 43 మిల్లీమీటర్ల అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, వెనుక ఏడు దశల్లో సర్దుబాటు చేసుకునే ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి.
ముందు 320 మిల్లీమీటర్లు, వెనుక 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేకులతో డ్యూయల్ ఛానల్ ABSను స్టాండర్డ్‌గా ఇచ్చారు. ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చారు.
ధర, భారత మార్కెట్‌లో విడుదల వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.