IRDAI: కార్లు, బైకుల బీమాలో కొత్త రూల్స్.. డిసెంబర్ 15 నుంచి అమలు
ఈ వార్తాకథనం ఏంటి
కారు లేదా బైక్‌కు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏయే రక్షణలు అవసరమో ఎంచుకునే అవకాశం వాహనదారులకు మరింత స్పష్టంగా అందనుంది. మోటార్ బీమా పాలసీలను నాలుగు విభాగాలుగా అందించాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 2026 నవంబర్ 2న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, ఈ విధానం డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఆ తేదీ నుంచి జారీ చేసే అన్ని ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాల పాలసీలకు ఇది వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ మార్పులు చేపట్టారు.
Details
బీమా కవరేజీలో నాలుగు విభాగాలు
కొత్త విధానంలో మొదటి విభాగం థర్డ్ పార్టీ బాధ్యత. ప్రమాదంలో ఇతరులకు గాయాలు, ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగితే వాహన యజమానికి ఉండే చట్టపరమైన బాధ్యతకు ఇది రక్షణ కల్పిస్తుంది. ఇది తప్పనిసరి.
రెండో విభాగం కారులోని ప్రయాణికులు, బైక్‌పై వెనుక కూర్చునే వ్యక్తులు, బీమా చేసిన వారి ఉద్యోగులకు సంబంధించిన చట్టపరమైన బాధ్యతను కవర్ చేస్తుంది. ఇది ఐచ్ఛికం.
మూడో విభాగంలో యజమాని-డ్రైవర్‌కు తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమాతో పాటు ఇతర ప్రయాణికులు, డ్రైవర్లకు ఐచ్ఛిక రక్షణ ఉంటుంది.
నాలుగో విభాగం వాహనానికి జరిగే నష్టం లేదా వాహనం కోల్పోవడాన్ని కవర్ చేస్తుంది. ఇది కూడా ఐచ్ఛికమే.
Details
మనకు నచ్చిన కవరేజీని ఎంచుకోవచ్చు
ఇకపై బీమా తీసుకునే సమయంలో అన్ని రకాల కవరేజీలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
థర్డ్ పార్టీ బీమా మాత్రం తప్పనిసరి. మిగతా ఐచ్ఛిక రక్షణలను తమ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి ఎంచుకోవచ్చు.
ఇందుకోసం బీమా సంస్థలు ప్రత్యేక కస్టమర్ ఆప్షన్ ఫామ్ ఇవ్వాలి. ఆన్‌లైన్‌లో పాలసీ కొనుగోలు చేసినా, నేరుగా కార్యాలయానికి వెళ్లి తీసుకున్నా తమకు కావాల్సిన కవరేజీలను ఎంపిక చేసుకోవచ్చు.
Details
పాత పాలసీలకు కూడా అదనపు అవకాశం
ఇప్పటికే థర్డ్ పార్టీ బీమా ఉన్నవారు కూడా పాలసీ గడువు ముగియకముందే ప్రయాణికుల రక్షణను అదనంగా పొందవచ్చు.
ఇందుకోసం అదనపు ప్రీమియం చెల్లించాలి. అయితే, ఈ సదుపాయాన్ని ప్రస్తుత థర్డ్ పార్టీ పాలసీ జారీ చేసిన బీమా సంస్థ ద్వారానే పొందాలి.
పాత పాలసీని రద్దు చేయాల్సిన అవసరం లేదు. బీమా సంస్థ జారీ చేసే అధికారిక ఎండార్స్‌మెంట్‌లో పేర్కొన్న తేదీ, సమయం నుంచే కొత్త కవరేజీ అమల్లోకి వస్తుంది.
Details
ప్రీమియం వివరాల్లో పారదర్శకత
ప్రతి కవరేజీకి ఎంత ప్రీమియం వసూలు చేస్తున్నారో పాలసీ పత్రాల్లో విడివిడిగా చూపించాలని IRDAI ఆదేశించింది.
పాలసీ తీసుకునే సమయంలో కస్టమర్ ఆప్షన్ ఫామ్‌తో పాటు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (CIS) కూడా అందించాలి.
కొత్త విధానాన్ని డిసెంబర్ 15 నుంచి బీమా సుగమ్ ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులోకి తీసుకురావాలి.
దీనివల్ల వాహనదారులు తమకు అవసరమైన బీమా రక్షణను అర్థం చేసుకుని, ఖర్చును పోల్చి మరింత స్పష్టమైన నిర్ణయం తీసుకోవచ్చు.