Mahindra XUV700 : లక్ష కార్లను రీకాల్ చేసిన మహీంద్రా
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. మహీంద్రా కంపెనీ పాపులర్ ఎస్‌యూవీ 700 మోడల్ కార్లను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. ఏకంగా లక్ష యూనిట్ల కార్లను వెనక్కి రప్పించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌యూవీ 700 కార్ల ఇంజన్ బేలో వైరింగ్ లూమ్ రూటింగ్‌లో లోపాల్ని గుర్తించింది. దీంతో 2021 జూన్ 8నుంచి 2023 జూన్ 28మధ్య తయారైన మొత్తం 1,08, 306 కార్లలో ఈ లోపాలు ఉన్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మహీంద్రా కంపెనీ ఈ మేరకు షేర్ మార్కెట్‌కు సమాచారమిచ్చింది. అదే సమయంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 400 మోడల్‌లో సైతం 3,560 కార్లను కంపెనీ పరిశీలించనుంది.
అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా చేయనున్న కంపెనీ
ఫిబ్రవరి 16వ తేదీ 2023 నుంచి జూన్ 5వ తేదీ 2023 మధ్యలో విడుదలైన 3,560 ఎక్స్‌యూవీ కార్లను సైతం కంపెనీ రీకాల్ చేసింది. 3560 కార్లలో బ్రైక్ పొటెన్షియోమీటర్‌లో స్ప్రింగ్ రిటర్న్ యాక్షన్ లో లోపాలు ఉండే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. కస్టమర్లకు కంపెనీ ఇదంతా ఉచితంగా చేసిపెట్టనుంది. కార్లలో ఉన్న సమస్యలను గుర్తించి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా కార్లను తయారు చేసి అందించనుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ధర 14.01 లక్షల నుంచి 26.18 లక్షల వరకూ ఉంది.