87,000 కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకి; కారణమిదే!
దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ తన ఎస్-ప్రెసో, ఈకో మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ కార్లలో స్టీరింగ్ లో సమస్య ఉన్న కారణంగా మొత్తం 87,599 కార్లను రీకాల్ చేస్తున్నట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2021, జూలై 5 నుంచి 2023, ఫిబ్రవరి 15వ తేదీల మధ్య తయారైన కార్లను రీకాల్ చేస్తున్నట్టు కంపెనీ ధ్రువీకరించింది. ఈ మేరకు ఆయా మోడల్ కార్లను ఇటీవల కొనుగోలు చేసిన వారు వెంటనే సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఎస్-ప్రెస్సో, ఎకో మోడల్ కార్లలో వినియోగించిన స్టీరింగ్ టై రాడ్‌లో లోపాలు తలెత్తడంతోనే రీకాల్ చేసినట్లు తెలుస్తోంది.
విడిభాగాలను ఉచితంగా అందజేస్తామన్న కంపెనీ
ఈ రీకాల్ జులై 24, 2023 సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రారంభమవుతుందని మారుతీ సుజుకీ ప్రకటించింది. మారుతీ సుజుకీ ఎస్ ప్రెస్సో మోడల్ ను 2009లో మార్కెట్లో లాంచ్ చేశారు. ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఐడియల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ వంటి ఫీచర్లే కాకుండా 25.3 కిలోమీటర్ల మైలేజీతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. అదే విధంగా ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, వంటి ఫీచర్లు ఉన్నాయి రీకాల్ వాహనాలను పరిశీలించి అవసరమైతే ఉచితంగా విడిభాగాలను అందజేస్తామని మారుతీ సుజుకీ స్పష్టం చేసింది.