Mini Cooper Oxford Limited: భారత్‌లో మినీ కూపర్ ఆక్స్‌ఫర్డ్ ఎడిషన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
మినీ కూపర్ ఆక్స్‌ఫర్డ్ ఎడిషన్‌కు భారత్‌లో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ నగరం స్ఫూర్తితో రూపొందించిన ఈ పరిమిత ఎడిషన్ కారు ప్రత్యేక డిజైన్, అదనపు ఫీచర్లతో వస్తోంది. ఇది 'S' వేరియంట్‌లో అందుబాటులో ఉండగా.. సాధారణ కూపర్ 3-డోర్‌లో ఉన్న 2.0లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌నే ఇందులోనూ ఉపయోగించారు. అయితే యూనియన్ జాక్ జెండా స్ఫూర్తితో చేసిన పలు డిజైన్ మార్పులు దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. మినీ కూపర్ ఆక్స్‌ఫర్డ్ ఎడిషన్‌లో బ్రిటన్ జెండా ఆధారిత డిజైన్ అంశాలు ఆకట్టుకుంటాయి. ఇండిగో సన్‌సెట్ బ్లూ, చిల్లీ రెడ్ రంగుల్లో ఈ కారును ఎంచుకోవచ్చు. బానెట్, టెయిల్‌గేట్‌పై యూనియన్ జాక్ స్ఫూర్తితో రూపొందించిన స్ట్రైప్స్ ఉంటాయి. ORVMలను గ్లేజ్డ్ వైట్ రంగులో ఇచ్చారు.
వివరాలు
యూనియన్ జాక్ డిజైన్‌తో ప్రత్యేక లుక్
రూఫ్‌పై యూనియన్ జాక్ స్టిక్కర్ ఉంటుంది. బూట్‌లిడ్‌పై ప్రత్యేక 'Flags' బ్యాడ్జ్ కూడా ఉంటుంది.
ఇక 18 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌కు నీలం,ఎరుపు రంగు సెంటర్ క్యాప్స్ ఇచ్చారు.
యూనియన్ జాక్ డిజైన్‌తో కూడిన వాల్వ్ క్యాప్స్ కూడా ఉంటాయి.సాధారణ కూపర్ ఎస్‌లో కనిపించే సిగ్నేచర్ సర్క్యులర్ LED హెడ్‌ల్యాంప్స్,ఆక్టాగోనల్ గ్రిల్‌ను ఇందులోనూ కొనసాగించారు.
వెనుక భాగంలో యూనియన్ జాక్ డిజైన్‌తో LED టెయిల్ ల్యాంప్స్, కూపర్ ఎస్ బ్యాడ్జింగ్ ఉంటాయి.
ఇంటీరియర్‌లో సాధారణ మినీ కూపర్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌నే కొనసాగించారు. అయితే గ్రే, బేజ్ ఫ్యాబ్రిక్ ట్రిమ్‌ను జోడించారు.
బ్లాక్ కలర్ JCW స్పోర్ట్ స్పెక్ సీట్లు స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి.
వివరాలు
ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకునే ఇంటీరియర్
ఫ్లోర్ మ్యాట్స్, స్టీరింగ్ వీల్ రిమ్‌పై యూనియన్ జాక్ స్ఫూర్తితో రూపొందించిన లోగోలు ఉంటాయి.
బ్లూ, రెడ్ రంగుల్లో 'Oxford' డోర్ సిల్స్, యూనియన్ జాక్ థీమ్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దానికి సరిపోయే కీ ఫాబ్‌ను అందించారు.
ఫీచర్ల విషయానికి వస్తే.. మినీ కూపర్ ఆక్స్‌ఫర్డ్ ఎడిషన్‌లో 9.4 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.
ఇందులో Apple CarPlay, Android Auto సపోర్ట్ లభిస్తుంది. పనోరమిక్ గ్లాస్ రూఫ్, హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, హీటెడ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మెమరీ, మసాజ్ ఫంక్షన్లతో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఆన్‌బోర్డ్ నావిగేషన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, OTA అప్‌డేట్స్ కూడా అందించారు.
వివరాలు
భద్రతా ఫీచర్లు,ఇంజిన్-పర్ఫార్మెన్స్ ఇలా..
భద్రత పరంగా లెవల్-1 ADAS, రెండు ఎయిర్‌బ్యాగ్స్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సర్లు, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటో డిమ్మింగ్ IRVM వంటి ఫీచర్లు ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఆక్స్‌ఫర్డ్ ఎడిషన్‌లో సాధారణ కూపర్ ఎస్‌లో ఉన్న 2.0 లీటర్, 4-సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌నే ఉపయోగించారు.
ఇది 204 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు పవర్ అందుతుంది.
0-100 కిలోమీటర్ల వేగాన్ని 6.6 సెకన్లలో అందుకుంటుందని మినీ చెబుతోంది. ఇంధన సామర్థ్యం 16.82 కిలోమీటర్లు/లీటర్‌గా కంపెనీ పేర్కొంది.
వివరాలు
ధర విషయానికి వస్తే..
ధర విషయానికి వస్తే.. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి వస్తున్నందున సాధారణ కూపర్ ఎస్‌తో పోలిస్తే ఆక్స్‌ఫర్డ్ ఎడిషన్ ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
మినీ గతంలో కూపర్ ఎస్‌కు GP ఇన్‌స్పైర్డ్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది.
ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్ ఎడిషన్‌తో అదే తరహా స్పెషల్ ఎడిషన్ వ్యూహాన్ని కొనసాగిస్తోంది. ఈ కారుకు భారత్‌లో ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.