Stock market crash: సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా పతనం.. రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ముడిచమురు ధరలు ఎగబాకడం, భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మరోవైపు ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు అంశం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా కుప్పకూలింది. నిఫ్టీ ఒక దశలో 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరింది. ఈ భారీ పతనంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.10 లక్షల కోట్లు తగ్గిపోయింది.
వివరాలు
భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
గురువారం ఉదయం సెన్సెక్స్ 72,668.00 వద్ద ప్రారంభమైంది. గత ముగింపు 72,638.70తో పోలిస్తే పెద్దగా మార్పు లేకుండా ప్రారంభమైనప్పటికీ.. కొద్దిసేపటికే సూచీ నష్టాల్లోకి జారుకుంది.
ఆ తర్వాత రోజంతా ఒత్తిడిలోనే కొనసాగింది. ఇంట్రాడేలో 71,327.75 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
చివరకు 1,045.46 పాయింట్లు కోల్పోయి 71,593.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది.
371.25 పాయింట్లు తగ్గి 22,231.80 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.78గా నమోదైంది.
సెన్సెక్స్ 30లో టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ మినహా మిగిలిన కంపెనీల షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి.
ఐటీసీ, ఇండిగో, పవర్ గ్రిడ్, బీఈఎల్, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.
వివరాలు
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలివే..
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 104.42 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం ఔన్స్ ధర 4,123.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు:
గల్ఫ్ ప్రాంతంతో పాటు హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతుండటంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనలు పెరిగాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌కు ఇది ప్రతికూల పరిణామంగా మారింది.
వివరాలు
అమెరికా ట్రెజరీ రాబడుల పెరుగుదల:
10ఏళ్ల అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు మూడు బేసిస్ పాయింట్లు పెరిగి 5.31శాతానికి చేరాయి. అదే సమయంలో విదేశీ మదుపర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కూడా దేశీయ మార్కెట్లపై ఒత్తిడిని పెంచింది. బుధవారం ఒక్కరోజే విదేశీ మదుపర్లు రూ.6,100కోట్లకు పైగా విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు.
ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై ఆందోళనలు:
రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం కూడా మార్కెట్లకు ప్రతికూల సంకేతంగా మారింది. అంతర్జాతీయ పరిణామాలు,ద్రవ్యోల్బణ అంచనాలను బట్టి వడ్డీ రేట్లను మరోసారి పెంచే అవకాశం లేదా ప్రస్తుత స్థాయిలో కొనసాగించే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంకేతాలు ఇచ్చారు.దీంతో సమీపకాలంలో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చన్న ఆందోళనలు మదుపర్లలో పెరిగాయి.
వివరాలు
ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి:
ఆసియా మార్కెట్లలోనూ గురువారం ప్రతికూల పరిస్థితులు కనిపించాయి. జపాన్, షాంఘై, హాంకాంగ్ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. దక్షిణ కొరియా కాస్పీ సూచీ దాదాపు 2 శాతం వరకు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఈ బలహీనత ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైనా పడింది.