Loading...
AP Cabinet: 12 కీలక అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం.. తల్లికి వందనంపై కీలక నిర్ణయం
12 కీలక అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం.. తల్లికి వందనంపై కీలక నిర్ణయం

AP Cabinet: 12 కీలక అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం.. తల్లికి వందనంపై కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో 12 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ భేటీలో విద్య, గిరిజన సంక్షేమం, వైద్యం, ఉద్యానవనాలు, దేవాదాయ భూములు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ ఏపీ కేబినెట్‌ ప్రత్యేక తీర్మానం ఆమోదించినట్లు పార్థసారథి తెలిపారు. 'తల్లికి వందనం' పథకానికి రూ.10,208 కోట్లు కేటాయించి 68.05 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించినట్లు చెప్పారు. అలాగే వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే డైట్‌ ఛార్జీలను 10 శాతం పెంచినట్లు వివరించారు.

వివరాలు 

రేపల్లె ఆస్పత్రి విస్తరణకు ఆమోదం

విదేశీ, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి ఆకర్షించేలా రూపొందించిన ఉన్నత విద్యా విధానం-2026కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

గిరిజన విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్‌ పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్‌ అందించేందుకు విశాఖపట్నం మరికవలసలో 'కోచింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌' ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

రేపల్లె ఆస్పత్రి విస్తరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

విధి నిర్వహణలో మృతిచెందిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు రూ.1.50లక్షల వరకు గ్రాట్యుటీ అందించే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

కొండేపిలో గురుకులం ఏర్పాటుకు 7 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు ఆలయ అభివృద్ధి కోసం 7.66 ఎకరాల భూమిని కేటాయించినట్లు చెప్పారు.

పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులతో కూడిన సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్థసారథి వెల్లడించారు.

వివరాలు 

రాజధాని భూములకు సంబంధించి మంత్రి నారాయణకు చంద్రబాబు పలు సూచనలు

హార్టికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (APHIMS) కోసం రూ.20.62 కోట్ల ప్రాజెక్టుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

విశాఖ మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం ఐఐటీ-జేఈఈ,నీట్‌ కోచింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

కేబినెట్‌ సమావేశానికి మంత్రులు టీజీ భరత్‌,బీసీ జనార్దన్‌రెడ్డి,సత్యకుమార్‌ యాదవ్‌,కందుల దుర్గేష్‌ గైర్హాజరయ్యారు.

సమావేశం అనంతరం రాజధాని భూములకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారాయణకు పలు సూచనలు చేశారు.

ముఖ్యంగా కేటగిరీ-4, ఎండోమెంట్‌ భూములకు సంబంధించిన విషయాలపై చర్చించారు.

భూములకు సంబంధించి ఉన్న న్యాయపరమైన అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని మరోసారి తన దృష్టికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.

ADVERTISEMENT