UK DWP Cyberattack: ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న హ్యాకర్లు...బ్రిటన్ కార్మికశాఖపై సైబర్‌దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా కీలక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ దాడుల పరంపరలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లో పెన్షన్లు, సంక్షేమ పథకాల చెల్లింపులను నిర్వహించే కార్మిక, పింఛన్ల శాఖ (డీబ్ల్యూపీ) నవంబర్ 28న సైబర్ దాడికి గురైంది. తమ కంప్యూటర్ వ్యవస్థల్లోకి అనధికారికంగా ప్రవేశించేందుకు ప్రయత్నం జరిగినట్లు శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని ఆన్‌లైన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే పెన్షన్లు, సంక్షేమ పథకాల చెల్లింపులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Details
దాడి ఎలా జరిగింది? దర్యాప్తు ముమ్మరం
సైబర్ దాడి జరిగిన తర్వాత బ్రిటన్ అధికారులు అప్రమత్తమయ్యారు. నవంబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు కొన్ని ఆన్‌లైన్ సేవలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు.
కొంతమంది లబ్ధిదారులు చెల్లింపుల్లో ఆలస్యం జరిగిందని ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ జాప్యానికి తాజా సైబర్ దాడితో సంబంధం లేదని అధికారులు భావిస్తున్నారు.
దాడి వెనుక ఎవరు ఉన్నారు? ఏ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నారు? ఎంత మేరకు నష్టం జరిగింది? అనే అంశాలపై నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్, ప్రభుత్వ సైబర్ సమన్వయ సంస్థల సహకారంతో దర్యాప్తు కొనసాగుతోంది.
Details
అమెరికా రక్షణ వ్యవస్థపైనా హ్యాకర్ల కన్ను
బ్రిటన్ ఘటనకు ఒక రోజు ముందే అమెరికా వైమానిక దళానికి చెందిన 'క్లౌడ్ వన్' క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థలోనూ అనధికారిక చొరబాటు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
ఈ వ్యవస్థలో సైనిక కార్యకలాపాలు, సిబ్బంది, రవాణా వంటి కీలక సమాచారానికి సంబంధించిన డేటా ఉండే అవకాశం ఉండటంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్న సమయంలో చొరబాటును గుర్తించినట్లు సమాచారం.
దీంతో బ్యాక్‌ఆఫీస్ వ్యవస్థల మార్పిడి, కొన్ని కీలక అప్లికేషన్ల అప్‌డేట్లను నిలిపివేశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు అమెరికా సైబర్ కమాండ్ రంగంలోకి దిగింది.
రెండు దేశాలకు చెందిన కీలక ప్రభుత్వ వ్యవస్థలు వరుసగా సైబర్ దాడులకు గురికావడం అంతర్జాతీయంగా సైబర్ భద్రతపై ఆందోళనలను మరింత పెంచుతోంది.