Rahul Gandhi: నాపై 45 ఎఫ్‌ఐఆర్‌లు.. ఒక్కో కేసును ఒక్కో మెడల్‌గా భావిస్తా: రాహుల్
ఈ వార్తాకథనం ఏంటి
తనపై ఇప్పటివరకు 45 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని,వాటిలో ప్రతి కేసును తాను ఒక మెడల్‌గా భావిస్తానని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి చేపట్టిన నిరసనల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై ఎన్ని కేసులు నమోదైనా తాను భయపడబోనని స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై తమ అభ్యంతరాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష ఎంపీలు అక్టోబర్ 6న పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు మార్చ్ నిర్వహించారు. అయితే మార్గమధ్యలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
వివరాలు
45 కేసులు.. 100 కావాలి
దీంతో ఆకాశవాణి భవన్ వద్ద ప్రతిపక్ష ఎంపీలు బైఠాయించి సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు నిరసన కొనసాగించారు.
అనంతరం రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఫిర్యాదు నేపథ్యంలో రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర ఎంపీలు,నేతలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసులపై రాహుల్ గాంధీ స్పందించారు.
తనపై నమోదయ్యే ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను ఒక్కో మెడల్‌తో సమానంగా భావిస్తానని చెప్పారు.
ఇప్పటికే తనపై 45 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని, అవి 100కు చేరాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని, ఎఫ్‌ఐఆర్‌లకు తాను భయపడబోనని అన్నారు.
వివరాలు
జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టాలనేది మా ప్రణాళిక: రాహుల్ గాంధీ
సుమారు 300 మంది లోక్‌సభ ఎంపీలు మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను కలవాలని ప్రయత్నించారని, అయితే తమకు ఆ అవకాశం కల్పించలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
అయితే ఈ విషయంపై ఎన్నికల సంఘం మాత్రం తమకు ఏ రాజకీయ పార్టీ నుంచి అధికారికంగా సమావేశం కోరుతూ అభ్యర్థన అందలేదని తెలిపింది.
"ఈరోజు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టాలనేది మా ప్రణాళిక. జ్ఞానేశ్ కుమార్ చట్టబద్ధమైన సీఈసీ కాదని దేశానికి చెప్పాలనుకుంటున్నాం. వీరు దేశద్రోహులు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి" అని రాహుల్ గాంధీ అన్నారు.
ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిరసన చేపట్టినట్లు ఆయన తెలిపారు.